Sarita Mali : సిగ్నల్స్‌ వద్ద కార్ల వెంట పరిగెడుతూ పూలమ్మేవాళ్లం!

‘అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నదీ.. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది..’ అన్నాడో సినీ కవి. ముంబయికి చెందిన సరితా మాలి జీవితం ఇందుకు సరిగ్గా సరిపోతుంది. మురికి వాడలో, నిరుపేద కుటుంబంలో పుట్టిపెరిగిన ఆమెకు కష్టాలు కొత్త కాదు.. కానీ వాటి వెంటే సుఖాలూ ఉంటాయని....

Published : 19 May 2022 15:01 IST

(Photos: Facebook)

‘అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నదీ.. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది..’ అన్నాడో సినీ కవి. ముంబయికి చెందిన సరితా మాలి జీవితం ఇందుకు సరిగ్గా సరిపోతుంది. మురికి వాడలో, నిరుపేద కుటుంబంలో పుట్టిపెరిగిన ఆమెకు కష్టాలు కొత్త కాదు.. కానీ వాటి వెంటే సుఖాలూ ఉంటాయని బలంగా నమ్మిందామె. ఇందుకు చదువే సిసలైన మార్గం అని నిర్ణయించుకుంది. ఓవైపు తండ్రికి చేదోడువాదోడుగా వీధుల్లో పూలమ్ముతూనే.. మరోవైపు చదువుపై దృష్టి పెట్టింది. ఫలితంగానే ప్రతిష్టాత్మక జేఎన్‌యూలో చేరే మహదవకాశం సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఇదే ప్రతిభతో అమెరికాలోని రెండు ప్రముఖ యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ సీటు సొంతం చేసుకుందామె. మరో రెండు నెలల్లో ఇక్కడ చదువు పూర్తి చేసుకొని క్యాలిఫోర్నియా వెళ్లబోతోన్న ఈ చదువుల తల్లి.. తన కష్టాల కడలిని ఇటీవలే ఫేస్‌బుక్‌ పోస్ట్‌ రూపంలో పంచుకోగా.. అది కాస్తా వైరల్‌గా మారింది.

వాళ్లను చూస్తే నా చిన్నతనం గుర్తొస్తుంది!

‘ముంబయి స్లమ్‌, జేఎన్‌యూ (జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ), క్యాలిఫోర్నియా, ఛాన్స్‌లర్‌ ఫెలోషిప్‌, అమెరికా, హిందీ సాహిత్యం.. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ ప్రతి ప్రయాణం వెనుక ఓ భావోద్వేగపూరిత కథ ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. అలాగే వాటిని ఎదుర్కొన్న విధానం వేర్వేరుగా ఉంటుంది. నాదీ అలాంటి కథే! నేను ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌ జిల్లాలో పుట్టాను.. ముంబయిలో పెరిగాను. నాన్న ముంబయి సిగ్నల్స్‌ వద్ద పూలమ్మేవాడు. ఇప్పటికీ నేను దిల్లీ సిగ్నల్స్‌ వద్ద నుంచి వెళ్తున్నప్పుడు.. అక్కడ కార్ల వెంట పరిగెత్తుతూ వస్తువులు అమ్మే పిల్లల్ని చూస్తే నా చిన్నతనమే నా కళ్ల ముందు కదలాడుతుంది. అంతేకాదు.. ‘అసలు ఈ పిల్లలు చదువుకోగలరా?’, ‘వాళ్ల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది?’.. అన్న ప్రశ్నలు కూడా నా మనసును తొలిచేస్తుంటాయి. నేను, నా తోబుట్టువులు కూడా పండగలు, ప్రత్యేక సందర్భాల్లో నాన్నతో కలిసి పూలమ్మేవాళ్లం. ఈ క్రమంలో చుట్టూ ఉన్న సమాజం మమ్మల్ని చిన్న చూపు చూసేది. మా జీవితం ఇంతేనని నలుగురు నానా మాటలు అనే వారు.

నాన్న మాటలే స్ఫూర్తిగా..!

అప్పుడు నాన్న మాకు ఒక్కటే మాట చెప్పేవారు. ఈ కష్టాలన్నీ తొలగిపోవాలంటే అందుకు చదువొక్కటే మార్గమని! చదువుకుంటేనే ఈ సమాజానికి మనమేంటో నిరూపించుకోగలమని, మనవంతుగా ఈ సమాజాభివృద్ధికి కృషి చేయగలమని.. లేదంటే ఇలా రోజూ నవ్వుల పాలు కాకతప్పదనేవారు. ఈ మాటలే నాలో స్ఫూర్తి నింపాయి. చదువులో చక్కటి ప్రతిభ కనబరిచేందుకు దోహదం చేశాయి. ఇక పైచదువుల కోసం దరఖాస్తు చేసుకునే క్రమంలో మా కజిన్‌ జేఎన్‌యూ గురించి, అది అందించే నాణ్యమైన విద్య గురించి నాకు చాలా విషయాలు చెప్పారు. దీంతో ఇందులో చేరే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యా. అలా 2014లో హిందీ సాహిత్యం విభాగంలో పీజీలో సీటొచ్చింది. ఈ విశ్వవిద్యాలయం తొలుత నన్ను ఓ మనిషిలా మార్చింది. ఆ తర్వాత ఈ సమాజంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులపై గళమెత్తే అవకాశం అందించింది. ఓ యువ రీసెర్చ్‌ స్కాలర్‌గా ప్రపంచం గురించిన బోలెడన్ని విషయాలు తెలుసుకోగలిగాను. అందుకే జేఎన్‌యూ నా జీవితానికి కీలక మలుపు అని చెప్తా.

అది మన చేతుల్లోనే ఉంది!

ఇప్పటికీ నా చుట్టూ ఉన్న వారిలో కొంతమంది నా జీవితం నుంచి స్ఫూర్తి పొందితే.. మరికొంతమంది ‘నాన్న చిరుద్యోగి.. నువ్వేమో జేఎన్‌యూలో చదువుతున్నావు.. ఇన్నేళ్ల చదువా?’ అని ఆశ్చర్యపోతుంటారు. అలాంటి వాళ్లందరికీ నేను ఒక్కటే విషయం చెప్తా.. మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఎవ్వరూ చెప్పలేం.. కానీ ఎలాంటి జీవితాన్ని ఎంచుకోవాలనేది మాత్రం మన చేతుల్లోనే ఉంది. ప్రస్తుతం జేఎన్‌యూలోని భారతీయ భాషా విభాగంలో హిందీ సాహిత్యంలో పీహెచ్‌డీ చేస్తున్నా. ఈ జులై నాటికి ఎంఏ, ఎంఫిల్‌ పూర్తి చేసి థీసిస్‌ను సమర్పించబోతున్నా. ఇక ఇప్పటికే పైచదువుల కోసం అమెరికాలోని క్యాలిఫోర్నియా యూనివర్సిటీ, వాషింగ్టన్‌ యూనివర్సిటీల నుంచి ఆహ్వానం అందింది. అయితే నేను క్యాలిఫోర్నియా యూనివర్సిటీని ఎంచుకున్నా. నా ప్రతిభ, అకడమిక్‌ రికార్డు ఆధారంగా ఈ విశ్వవిద్యాలయం నాకు ఫెలోషిప్స్‌ కూడా అందించింది. ఇందులో భాగంగా హిందీలో ‘Subaltern Women’s Writing During The Bhakti Period’ అనే అంశంపై పీహెచ్‌డీ చేయబోతున్నా..’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్