Ravi Shastri: కోహ్లీ.. మరో రెండేళ్లు టెస్టు కెప్టెన్‌గా ఉండేవాడే, కానీ..

టెస్టు ఫార్మాట్‌లోనూ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్‌ కోహ్లీ ఇటీవల సంచలన ప్రకటన చేశాడు. దీంతో అన్ని ఫార్మాట్ల నుంచి కోహ్లీ కెప్టెన్‌గా తప్పుకున్నట్లైంది.

Published : 24 Jan 2022 12:05 IST

సుదీర్ఘ ఫార్మాట్‌లో విరాట్‌ నాయకత్వంపై రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు

ఇంటర్నెట్‌డెస్క్‌: టెస్టు ఫార్మాట్‌లోనూ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్‌ కోహ్లీ ఇటీవల సంచలన ప్రకటన చేశాడు. దీంతో అన్ని ఫార్మాట్ల నుంచి కోహ్లీ కెప్టెన్‌గా తప్పుకున్నట్లైంది. అయితే, సుదీర్ఘ ఫార్మాట్‌లో విరాట్ కెప్టెన్సీపై టీమిండియా మాజీ కోచ్‌ రవి శాస్త్రి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ మరో రెండేళ్లు టెస్టు కెప్టెన్‌గా కొనసాగగలడని, కానీ అతడి విజయాలను చాలా మంది జీర్ణించుకోలేకపోయేవారని శాస్త్రి పేర్కొన్నాడు. ఏదేమైనప్పటికీ కోహ్లీ నిర్ణయాన్ని మనమంతా గౌరవించాలని తెలిపారు.

‘‘టెస్టుల్లో భారత్‌ను విరాట్‌ కోహ్లీ నడిపించగలడా అంటే.. కచ్చితంగా కనీసం మరో రెండేళ్లు అతడు టెస్టు కెప్టెన్‌గా కొనసాగగలడు. ఎందుకంటే వచ్చే రెండేళ్లు భారత్‌కు స్వదేశంలోనే మ్యాచ్‌లు ఉన్నాయి. పర్యాటక జట్లు కూడా ర్యాంకింగ్స్‌ పరంగా చిన్నవే. కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగితే తన సారథ్యంలో టెస్టు విజయాల సంఖ్య 50-60కి పెంచుకునేవాడు. కానీ, చాలా మంది దాన్ని జీర్ణించుకోలేరు’’ అని శాస్త్రి చెప్పుకొచ్చారు. 

సుదీర్ఘకాలం పాటు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా కొనసాగిన కోహ్లీ నిర్ణయాన్ని మనమంతా గౌరవించాల్సిన అవసరం ఉందని శాస్త్రి అభిప్రాయపడ్డారు. ‘‘టెస్టు ఫార్మాట్‌లో 5-6 ఏళ్ల పాటు కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నారు. అందులో ఐదేళ్ల పాటు టీమిండియా టెస్టుల్లో నంబర్‌ వన్‌గా నిలిచింది. 68 మ్యాచ్‌ల్లో 40 విజయాలు సాధించాడు. ఇలాంటి అరుదైన రికార్డును మరే భారత కెప్టెన్ సాధించలేదు. ప్రపంచంలోనూ ఇలాంటి ఘనత సాధించిన సారథులు కొంతమందే ఉన్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ వంటి జట్లపైనా గెలిచాడు. అందువల్ల, అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సేవలందించిన కోహ్లీ.. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు ప్రకటిస్తే ఆ నిర్ణయాన్ని మనం గౌరవించాలి’’ అని మాజీ కోచ్‌ తెలిపారు. 

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో టీమిండియా ఓటమి అనంతరం సుదీర్ఘ ఫార్మాట్‌ కెప్టెన్సీకి గుడ్‌బై చెబుతున్నట్లు కోహ్లీ చేసిన ప్రకటన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికే టీ20, వన్డేల సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న కోహ్లీ.. ఈ నిర్ణయంతో అన్ని ఫార్మాట్ల సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగినట్లయింది. కోహ్లీ నాయకత్వంలోనే భారత జట్టు టెస్టుల్లో ఆస్ట్రేలియాపై చారిత్రక విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అంతేగాక, అతడి కెప్టెన్సీలో సుదీర్ఘ కాలం పాటు భారత్‌ టెస్టు ర్యాకింగ్స్‌లో అగ్ర స్థానంలో కొనసాగింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని