Supreme Court: మహారాష్ట్ర, బెంగాల్‌, రాజస్థాన్‌ ప్రభుత్వాలపై సుప్రీం ఆగ్రహం

కొవిడ్‌ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులో జాప్యం విషయమై సుప్రీం కోర్టు సోమవారం మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ ప్రభుత్వాలపై మండిపడింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం ఈ వ్యవహారంపై విచారణ...

Published : 06 Dec 2021 21:42 IST

కొవిడ్‌ పరిహారం జాప్యం విషయంలో మూడు రాష్ట్రాలపై సుప్రీం కోర్టు మండిపాటు

దిల్లీ: కొవిడ్‌ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులో జాప్యం విషయమై సుప్రీంకోర్టు సోమవారం మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ ప్రభుత్వాలపై మండిపడింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం ఈ వ్యవహారంపై విచారణ కొనసాగించింది. ‘మహారాష్ట్రలో లక్షకుపైగా మరణాలు నమోదైతే, కేవలం 37 వేల దరఖాస్తులు మాత్రమే అందాయి. అందులోనూ ఒక్కరికీ పరిహారం చెల్లించలేదు. ఇది హాస్యాస్పదం. దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదు’ అని జస్టిస్ షా స్పష్టం చేశారు.

పరిహారం పంపిణీని ప్రారంభించేందుకు మరింత సమయం కావాలని కోరుతూ, ఈ విషయమై త్వరలో అఫిడవిట్ దాఖలు చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది విన్నవించగా.. ‘మేం రాష్ట్ర ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకుంటాం. అప్పుడు మీరు ఆ అఫిడవిట్‌ను జేబులో ఉంచుకొని ముఖ్యమంత్రికి ఇవ్వండి’ అని జస్టిస్‌ ఆర్‌ఎం షా వ్యాఖ్యానించారు. వెంటనే పరిహారం చెల్లింపులు ప్రారంభించాలని ఆదేశించారు.

‘విస్తృత ప్రచారం కల్పించండి’

పశ్చిమ బెంగాల్‌లోనూ 19 వేల మంది మృతి చెందగా, 467 దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లు తేలిందని ధర్మాసనం పేర్కొంది. ఇప్పటి వరకు కేవలం 110 మందికి మాత్రమే పరిహారం చెల్లించినట్లు చెప్పింది. రాజస్థాన్‌లో దాదాపు తొమ్మిది వేల మరణాలు నమోదు కాగా, వాటిలో ఇప్పటివరకు 595 దరఖాస్తులు వచ్చాయని, ఇంకా ఎవరికీ పరిహారం చెల్లించలేదని గుర్తుచేసింది. ‘మానవత్వంతో వ్యవహరించమని మీ ప్రభుత్వానికి చెప్పండి’ అని రాజస్థాన్‌ తరఫు న్యాయవాదికి సూచించింది. పరిహారం విషయమై వార్తాపత్రికలు, టీవీలు, రేడియోల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణ డిసెంబర్ 10న జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని