Omicron: ఒమిక్రాన్‌ బాధితుల్లో  స్వల్ప లక్షణాలు..!

సార్స్‌కోవ్‌-2 కొత్త మ్యూటేషన్‌ ‘ఒమిక్రాన్‌’ వేరియంట్‌ సోకిన రోగుల్లో స్వల్పలక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని.. వారికి ఇంటి వద్దనే ఉంచి చికిత్సను అందించవచ్చని దక్షిణాఫ్రికాకు చెందిన ఒక డాక్టర్‌ వెల్లడించారు.

Updated : 30 Nov 2021 15:10 IST

 వెల్లడించిన దక్షిణాఫ్రికా డాక్టర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: సార్స్‌కోవ్‌-2 కొత్త మ్యూటేషన్‌ ‘ఒమిక్రాన్‌’ వేరియంట్‌ సోకిన రోగుల్లో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని.. వారిని ఇంటి వద్దే ఉంచి చికిత్స అందించొచ్చని దక్షిణాఫ్రికాకు చెందిన ఒక డాక్టర్‌ వెల్లడించారు. దక్షిణాఫ్రికా మెడికల్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు డాక్టర్‌ ఏంజెలిక్‌ కోయెట్జీ ఓ ఆంగ్ల వార్తా సంస్థ వద్ద ఈ విషయాన్ని వెల్లడించారు. కోయెట్జీ దక్షిణాఫ్రికా వ్యాక్సిన్‌ కమిటీలో సభ్యురాలు కూడా. కొత్త వేరియంట్‌ను తొలిదశలో అనుమానించిన వారిలో ఆమె కూడా ఒకరు. డెల్టా వేరియంట్‌ కంటే భిన్నమైన లక్షణాలతో ఏడుగురు పేషెంట్లు వచ్చినట్లు వెల్లడించారు. వీరిందరికీ స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయని పేర్కొన్నారు. ఈ ఘటన నవంబర్‌ 18న జరిగినట్లు వివరించారు.  నవంబర్‌ 25న  దక్షిణాఫ్రికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కమ్యూనికేబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌ఐసీడీ) సంస్థ ఒమిక్రాన్‌ వేరియంట్‌ వివరాలను వెల్లడించింది.

ఈ విషయమై కోయెట్జీ మాట్లాడుతూ తన వద్దకు వచ్చిన పేషెంట్లు తీవ్రమైన ఒళ్లునొప్పులు, తలనొప్పితో రెండ్రోజులు బాధపడ్డారని పేర్కొన్నారు. ‘‘ఆ సమయంలో వారి లక్షణాలు సాధారణ వైరల్‌ ఇన్ఫెక్షన్‌ లక్షణాలను పోలి ఉన్నాయి. అప్పటికి 10 వారాల వరకు మా ప్రాంతంలో కొవిడ్‌ కేసులు రాలేదు. దీంతో వారికి పరీక్షలు చేయించాలని నిర్ణయించాం. ఆ పేషెంట్‌, వారి కుటుంబ సభ్యులకూ వైరస్‌ సోకింది. అదే రోజు అటువంటి లక్షణాలతో మరికొంత మంది పేషెంట్లు వచ్చారు. ఏదో మార్పు వచ్చినట్లు అనుమానించాను. ఆ తర్వాత ఎన్‌ఐసీడీని  అదే రోజు అప్రమత్తం చేశాను. ఆ తర్వాత నిత్యం ఇద్దరు లేదా ముగ్గురు కొవిడ్‌ పేషెంట్లు నా క్లినిక్‌కు రావడం మొదలైంది. వారందరిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయి. ఆ పేషెంట్లను ఇంటి వద్ద ఉంచే చికిత్స అందించాం. వాసన, రుచి పోవడం, ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోవడం వంటి లక్షణాలు కనిపించలేదు’’ అని పేర్కొన్నారు.

పీసీఆర్‌ పరీక్షల్లో గుర్తించవచ్చు: ప్రపంచ ఆరోగ్య సంస్థ 

కరోనా కొత్త వేరియంట్‌ను గుర్తించే అంశంపై ఆదివారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటన చేసింది. దీనిని కూడా ఇతర వేరియంట్ల వలే పీసీఆర్‌ పరీక్షల్లో గుర్తించవచ్చని వెల్లడించింది. ఇతర పరీక్షల ఫలితాలను ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఏమేరకు ప్రభావితం చేస్తోందనే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయని పేర్కొంది. ఈ వేరియంట్‌ వ్యాప్తి వేగం ఏ స్థాయిలో ఉందనే అంశంపై , రోగ లక్షణాల తీవ్రతపై పరిశోధనలు జరుగుతున్నట్లు తెలిపింది. ఈ కొత్త వేరియంట్‌ లక్షణాలు మిగిలిన వాటికంటే ఎంత భిన్నంగా ఉంటాయో కూడా చెప్పేందుకు తగినంత సమాచారం లేదని పేర్కొంది. కాకపోతే గతంలో కొవిడ్‌ బారినపడిన వారు కూడా మరోసారి ఒమిక్రాన్‌ బారిన పడేందుకు అవకాశం ఉందనటానికి ఆధారాలు లభించాయని వెల్లడించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ‘ఆందోళనకర వేరియంట్‌’గా ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు వెలుగు చూసినా ఆల్ఫా,బీటా,గామా వేరియంట్లకంటే ప్రమాదకరమైన జాబితాలోకి చేరింది. ఈ జాబితాలో ప్రస్తుతం డెల్టా వేరియంట్‌ మాత్రమే ఉంది. ఆదివారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు ఒమిక్రాన్‌ వ్యాపించింది. కాలంతో పోటీపడి దీనిని అడ్డుకోవాలని ఐరోపా సమాఖ్య చీఫ్‌ వ్యాఖ్యానించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని