Tourism: పర్యాటకంపై ఒమిక్రాన్‌ ప్రభావం.. బుకింగ్స్‌ రద్దు చేసుకుంటున్న సందర్శకులు

గతేడాదంతా కరోనా.. లాక్‌డౌన్‌తో పర్యటక రంగం కుంటుపడింది. ప్రయాణాలపై ఆంక్షలు, సందర్శక ప్రాంతాలు, హోటల్స్‌ మూసివేతతో ఆర్థికంగా చితికిపోయింది. పరిస్థితులు మెరుగై ఇప్పుడిప్పుడే సంక్షోభం నుంచి తేరుకుంటున్న పర్యటకం రంగంపై కరోనా మహమ్మారి మరోసారి తీవ్ర ప్రభావం

Updated : 03 Dec 2021 11:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతేడాదంతా కరోనా.. లాక్‌డౌన్‌తో  పర్యాటక రంగం కుంటుపడింది. ప్రయాణాలపై ఆంక్షలు, సందర్శక ప్రాంతాలు, హోటల్స్‌ మూసివేతతో ఆర్థికంగా చితికిపోయింది. పరిస్థితులు మెరుగై ఇప్పుడిప్పుడే సంక్షోభం నుంచి తేరుకుంటున్న పర్యాటక రంగంపై  కరోనా కొత్త వేరియంట్‌ రూపంలో మరోసారి తీవ్ర ప్రభావం పడుతోంది. ఒమిక్రాన్‌ కారణంగా పర్యాటకానికి  మళ్లీ కరోనా మొదటి దశ పరిస్థితులు రాబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

విదేశాలకు వెళ్లే పర్యాటకుల పరిస్థితి..

ఈ మధ్యే అన్ని దేశాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తివేసి పర్యాటకుల్ని ఆహ్వానించడం ప్రారంభించాయి. దీంతో క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకలు విదేశాల్లో జరుపుకోవాలని కొంతమంది భారతీయులు ముందుగానే బుకింగ్స్‌ కూడా చేసుకున్నారు. ముఖ్యంగా దుబాయ్‌, యూరప్‌ దేశాలు, యూఎస్‌కి వెళ్లేందుకు ఆసక్తి చూపినట్లు ట్రావెల్‌ ఏజెంట్లు చెబుతున్నారు. అయితే, దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ అన్ని దేశాలకు వ్యాపిస్తుండటంతో భయాందోళనకు గురవుతున్న ప్రజలు వారి విదేశీ విహారయాత్రలను రద్దు చేసుకుంటున్నట్లు సమాచారం. తమ ఏజెన్సీలో ఇప్పటికే దాదాపు 20శాతం బుకింగ్స్‌ రద్దయ్యాయని చెన్నైకి చెందిన ఓ ట్రావెల్‌ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అమలు చేస్తున్న కఠిన నిబంధనలు కూడా విహారయాత్రలు రద్దు చేసుకోవడానికి ఒక కారణంగా భావిస్తున్నారు.

దేశీయ పర్యాటకులదీ అదే దారి..

భారత్‌లోనూ ఒమిక్రాన్‌ కేసులు బయటపడటంతో దేశీయ పర్యాటకంపై కూడా ప్రభావం పడింది. విహారయాత్రలకు అనువైన గోవా, కేరళ రాష్ట్రాలకు ఒమిక్రాన్ ప్రభావం ముందుగానే తాకింది. క్రిస్మస్‌, నూతన సంవత్సరం సందర్భంగా విదేశాలకు వెళ్లేంత ఆర్థిక స్థోమత లేని చాలా మంది కేరళ లేదా గోవాకు వెళ్లాలని ప్రణాళికలు వేసుకున్నారు. ఈ క్రమంలో ట్రావెల్‌, హోటల్‌ బుకింగ్స్‌ కూడా జరిగిపోయాయి. కానీ, ఒమిక్రాన్‌ భయంతో 50శాతం మంది పర్యాటకులు కేరళలో హోటల్‌ బుకింగ్స్‌ను రద్దు చేసుకున్నారట. దీంతో హోటల్స్‌ యాజమాన్యాలు ముందస్తు బుకింగ్స్‌ను కూడా నిలిపివేస్తున్నాయి. గోవాలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది.

ఇతర ప్రాంతాల్లో కొంతమంది బుక్సింగ్‌ చేసుకుంటున్నా.. వారిలో దాదాపు 75 శాతం మంది రద్దు చేసుకుంటే డబ్బులు పూర్తిగా వెనక్కివచ్చే ఆప్షన్‌ను ఎంచుకుంటున్నారట. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో అడుగుపెట్టాలంటే కొవిడ్‌ టెస్ట్‌ రిపోర్టు లేదా వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ తప్పనిసరి చేసింది. ఇవే నిబంధనలను ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తే.. పర్యటక రంగం మళ్లీ గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు.

Read latest General News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని