logo
Updated : 01/12/2021 06:29 IST

తీవ్రత తగ్గుముఖం..!

నేడు ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం
సత్యనారాయణపురం, న్యూస్‌టుడే

జిల్లాలో ఎయిడ్స్‌ నియంత్రణే లక్ష్యంగా సంబంధిత శాఖాధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ మండలి నిర్వహిస్తున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఎయిడ్స్‌తో పాటు క్షయ, కొవిడ్‌ వంటి మహమ్మారిలను అంతం చేయాలన్న సంకల్పంతో ఈ ఏడాది పని చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ‘అంతం చేద్దాం అసమానతలను’ అనే నినాదాన్ని ఈ ఏడాది ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవ నినాదంగా ప్రకటించింది.

జిల్లాలో గత మూడేళ్లలో హెచ్‌ఐవీ బాధితుల పెరుగుదల గణనీయంగా తగ్గింది. 2014-15లో 3.69 శాతం ఉండగా, ప్రస్తుతం 1.11గా ఉంది. గర్భిణుల విషయంలో తల్లి నుంచి బిడ్డకు సోకే శాతం 2015లో 0.18 శాతం ఉండగా ప్రస్తుతం 0.13శాతానికి తగ్గింది.

ఆధునిక వైద్యం, పరీక్షలు
జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ మండలి.. 164 పరీక్షా కేంద్రాల ద్వారా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం 4 ఏఆర్‌టీ కేంద్రాలు, 6 లింక్‌ ఏఆర్‌టీ కేంద్రాల ద్వారా 21,332 మంది హెచ్‌ఐవీ బాధితులకు ఉచితంగా వైద్య సేవలు, కౌన్సెలింగ్‌ అందజేస్తున్నారు. ఈ ఏడాది బాధితులను త్వరగా గుర్తించడంతో పాటు, వారికి అవసరమైన వైద్య పరీక్షలు చేస్తున్నారు. వ్యాధి తీవ్రతను నిర్ధారించేందుకు అత్యాధునిక యంత్ర పరికరాలను ప్రభుత్వం అందజేసింది. చికిత్స కోసం ఆధునిక ఔషధాలు ప్రవేశపెట్టారు. అవగాహన కార్యక్రమాలూ నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా వ్యాధి తీవ్రత బాగా తగ్గుతోంది. ఈ ఏడాదిలో ఉత్తమ సేవలు అందించిన గుడివాడ ఏఆర్‌టీ కేంద్రం ప్రథమ స్థానం పొందింది.

పిల్లల కోసం ప్రత్యేక సేవలు
జిల్లాలో 17 సంవత్సరాల వయసులోపు వారిలో 800 మంది వరకు హెచ్‌ఐవీ బాధితులున్నారు. వీరందరికీ అవసరమైన పౌష్టికాహారం, దుస్తులు, ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో ఒక స్వచ్ఛంద సంస్థ బాధ్యతలు తీసుకుంది.

పింఛన్లు అందక దైన్యం..
జిల్లాలో 21 వేల మందికిపైగా బాధితులు.. చికిత్స నిమిత్తం మందులు వాడుతున్నారు. వీరందరికీ ప్రభుత్వం పింఛన్లు ఇవ్వాల్సి ఉంది. కానీ 3500 మందికి మాత్రమే మంజూరు చేసింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందనివాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ రూరల్‌ మండలానికి చెందిన ఓ మహిళ(53)కు వితంతు, హెచ్‌ఐవీ పింఛన్లు వచ్చేవి. గత మూడు నెలల క్రితం ఆధార్‌ కార్డు అనుసంధానం పేరుతో ఒక పింఛను తీసేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. అలాగే నందివాడ మండలానికి చెందిన ఓ వ్యక్తి (45) తాను హెచ్‌ఐవీ మందులు వాడుతున్నానని, నాలుగేళ్లు గడిచినా ఇప్పటికీ పింఛను ఇవ్వలేదని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరుతున్నారు.


కలిసి కట్టుగా పనిచేస్తున్నాం

జిల్లాలో హెచ్‌ఐవీని పూర్తిగా అదుపు చేసేందుకు 13 స్వచ్ఛంద సంస్థలు, ఏపీ శాక్స్‌ సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ, క్షయ నివారణ శాఖ సిబ్బందితో కలిసి పనిచేస్తున్నాం. బాధితులకు పింఛన్లు అందకపోవడం, సిబ్బంది కొరత సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో పరిష్కారమవుతాయి.    

- డాక్టర్‌ జె.ఉషారాణి, జిల్లా అదనపు వైద్యాధికారి

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని