logo
Published : 01/12/2021 06:11 IST

సాహితీ రుషి.. సిరివెన్నెల..!

జిల్లాతో ఆత్మీయ అనుబంధం

శివానందమూర్తికి పాద నమస్కారం చేస్తూ..

తెలుగు సాహిత్యంలో, తెలుగు ప్రేక్షకుల మదిలో తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి జిల్లాతో అనుబంధం ఉంది. జిల్లాలోని నిర్వహించిన పలు సాహిత్య కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. సాహిత్యం విలువ తెలిసిన చోట సీతారామశాస్త్రి వాలిపోతారనే నానుడి ఉంది. సిరివెన్నెల హఠన్మరణం తీరని లోటని పలువురు సాహితీ ప్రముఖులు పేర్కొన్నారు. కృష్ణాజిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి జి.వి పూర్ణచంద్‌ సిరివెన్నెలతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సిరివెన్నెలతో కలిసి హంస (కళారత్న)పురస్కారం అందుకోవడం గౌరంగా భావిస్తున్నానని చెప్పారు. ఒక మంచి సాహితీ మిత్రుణ్ణి కోల్పోయానని పేర్కొన్నారు. సాహితీ లోకానికి, సినీ గేయాభిమానులకు అశనిపాతం లాంటిదని సావిత్రి కళాపీఠం అధ్యక్షురాలు పరుచూరి విజయలక్ష్మి అన్నారు. ఆయన కలంతో కాలాన్ని చదివిన రుషి అని ఆంధ్రా ఆర్ట్స్‌ అకాడమీ అధ్యక్షుడు గోళ్ళ నారాయణ పేర్కొన్నారు. సిరివెన్నెల సాహిత్యం అన్ని వయసుల వారికి సులువుగా అర్థమవుతుందని అక్కినేని ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు చీదెళ్ళ నాగేశ్వరరావు అన్నారు. సినిమా పాటల ద్వారా అద్భుత సాహిత్యాన్ని అందించి, పాట విలువ పెంచిన ప్రముఖ సాహితీవేత్త అని ఎక్స్‌రే సాహిత్య సాంస్కృతిక సేవ సంస్థ అధ్యక్షుడు కొల్లూరి, ప్రధాన కార్యదర్శి బోడి ఆంజనేయరాజు పేర్కొన్నారు.

సద్గురు సేవలో...
సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి జగ్గయ్యపేట సమీపంలోని బలుసుపాడు శ్రీగురుధామ్‌ ధర్మ క్షేత్రానికి పలుమార్లు వచ్చారు. సద్గురు శివానందమూర్తి సేవలో తరించారు. తాత్వికులు గెంటేల వెంకటరమణ, వసంతలక్ష్మి దంపతులతో కుటుంబ సాన్నిహిత్యం ఉన్న ఆయన అనేక సార్లు గురుధామ్‌కు వచ్చి బస చేశారు. పాటలు రాసేటప్పుడు ఎదురయ్యే తాత్విక విషయాలపై వెంకటరమణతో చర్చించేవారు. ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునేందుకు మక్కువ చూపేవారు. తమ కుమారుల సినీరంగ ప్రవేశ సమయంలో వారిని ఇక్కడి గురు కుటుంబానికి పరిచయం చేశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తరువాత ఆయన కుటుంబ సభ్యులతో వెంకటరమణ దంపతులు ఫోన్‌లో మాట్లాడి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. మంగళవారం మరణ వార్త విని సంతాపం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మికతలోని లోతులను నవీన సాహిత్యంలో ప్రతిబింబించడంలో ఆయనకు ఆయనే సాటి అని వెంకటరమణ అన్నారు. ఆయన రాసిన శివదర్పణం పాటల ఆల్బమ్‌, సద్గురు శివానందమూర్తి భగవానులపై రాసిన పాటలు నిత్యం ఇక్కడ మారుమోగుతుంటాయని పేర్కొన్నారు.

ముక్కోటి వేడుకలకు హాజరై...
ప్రముఖ సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి దంపతులు నందిగామ ముక్కోటి మండపంలో నిర్వహించిన 119వ వైకుంఠ ఏకాదశి మహోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 24 డిసెంబరు 2018న వారిని ముక్కోటి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆ సమయంలో ఆయన తన సినీ ప్రస్థానాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఆయన మృతి పట్ల ముక్కోటి ఉత్సవ కమిటీ సభ్యుడు దీవి వెంకటరత్నమాచార్యులు సంతాపం తెలిపారు.


అమ్మ భాష అందరికీ అవసరం
ప్రపంచ తెలుగు రచయితల 4వ మహా సభల్లో

ప్రసంగిస్తున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి (దాచిన చిత్రం)

సిరివెన్నెలకు కృష్ణా జిల్లా రచయితల సంఘానికి ఎనలేని అనుబంధం ఉంది. 2018, ఫిబ్రవరిలో తెలుగు భాష బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఘంటసాల మండలం శ్రీకాకుళంలో నిర్వహించిన శ్రీకృష్ణదేవరాయ మహోత్సవాల్లో ఆయన అతిథిగా పాల్గొన్నారు. 2019 డిసెంబరులో విజయవాడలో నిర్వహించిన ప్రపంచ తెలుగు రచయితల 4వ మహాసభలకు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మనలో మౌలికత భారతీయత, దాన్ని ప్రదర్శించే వాహికగా అమ్మభాష అవసరమని, తెలుగు భాష గొప్పదనాన్ని సిరివెన్నెల కొనియాడారు. సీతారామశాస్త్రి తెలుగు సాహిత్యానికి చేసిన కృషిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుర్తించింది. 2018లో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆయనకు ఉగాది పురస్కారాల ప్రదానోత్సవంలో కళారత్న(హంస) పురస్కారం అందించి గౌరవించింది.

- న్యూస్‌టుడే, విజయవాడ సాంస్కృతికం, జగ్గయ్యపేట, నందిగామ గ్రామీణం, నందిగామ  

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని