logo
Published : 01/12/2021 05:44 IST

ఇంజనీరింగ్ వెలవెల!

తొలి విడతలో భారీగా మిగిలిపోయిన సీట్లు

యాజమాన్యాల ఆశలన్నీ మలివిడతపైనే

ఈనాడు, అమరావతి

ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్‌ కళాశాలలు ప్రవేశాలు లేక వెలవెలబోయాయి. ఇప్పటికే మొదటి విడత కౌన్సెలింగ్‌ ముగిసి సోమవారం నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. అయితే చాలా వరకు సీట్లు భర్తీ కాలేదు. సగటున ఏ కళాశాలలో చూసినా 50 నుంచి వందకు పైగా సీట్లు మిగిలిపోయాయి. మొదటి కౌన్సెలింగ్‌కే స్పందన లేకపోతే మలివిడత కౌన్సెలింగ్‌కు ఇంకేం స్పందన ఉంటుందని కళాశాల వర్గాలు లబోదిబోమంటున్నాయి. మలివిడతలో ఏ మేరకు సీట్లు భర్తీ అవుతాయో వేచి చూడాల్సిందేనని కళాశాల వర్గాలు అంటున్నాయి.

జిల్లాలో 42 కళాశాలల్లో సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్‌, సివిల్‌ తదితర అన్ని బ్రాంచిల్లో కలిపి సుమారు 14వేల సీట్లు ఉన్నాయి. వీటిలో తొలి విడత కౌన్సెలింగ్‌లో 7-8వేల సీట్లకు మించి భర్తీ కాలేదు. సుమారు 40-45 శాతం సీట్లు భర్తీ కాకుండా ఉన్నాయి. కరోనా కారణంగా గతేడాది ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు జరగలేదు. పరీక్ష ఫీజు చెల్లించిన ప్రతి విద్యార్థి ఉత్తీర్ణులేనని ప్రకటించడంతో ఇంజినీరింగ్‌ విద్యలో చేరే వారి సంఖ్య ఈసారి బాగా ఎక్కువగా ఉంటుందని, సీట్లు మొత్తం నిండుతాయని కళాశాల యాజమాన్యాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. అందుకు విరుద్ధంగా ప్రవేశాలు ఉండడం యాజమాన్యాలను కలిచివేసింది. ఈనెల 10 లోపు మలివిడత కౌన్సెలింగ్‌ను పూర్తి చేయాలనే యోచనలో ఉన్నత విద్యాశాఖ ఉంది.

గతం కన్నా  హీనం
గడిచిన రెండు, మూడేళ్లతో పోలిస్తే ఈసారే ప్రవేశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం ఫీజుల ఖరారు నుంచి కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ జారీ దాకా ప్రతి విషయంలో ఆలస్యం జరిగిందని, అప్పటికే చాలా మంది విద్యార్థులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయారని పేర్కొంటున్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఏ, బీ కేటగిరీ సీట్లకు వేర్వేరుగా కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఇలా చేయడం వల్ల విద్యార్థులు ఆ రెండు కేటగిరీ సీట్లకు వేర్వేరుగా రిజిస్ట్రేషన్‌ రుసుములు చెల్లించాల్సి రావడంతో చాలా మంది రిజిస్ట్రేషన్‌ ఫీజులు చెల్లించలేక ఏదో ఒకటి ఎంపిక చేసుకున్నారు. కొందరు రెండు కేటగిరీ సీట్లకు రిజిస్ట్రేషన్‌ ఫీజులు చెల్లించి సీట్లు కోరుకున్నారు. అయితే నచ్చిన కళాశాలలో సకాలంలో జాయినింగ్‌ రిపోర్టు ఇవ్వకున్నా, ఫీజు చెల్లించకపోయినా సంబంధిత విద్యార్థి సీటును రద్దు చేయలేదు. ఇలాంటి నిర్ణయాలతో సీట్లు మిగిలిపోయాయని అంటున్నారు. సాధారణంగా సీటు కేటాయించిన తర్వాత సకాలంలో జాయినింగ్‌ రిపోర్టు ఇవ్వకపోయినా, ఫీజు చెల్లించకపోయినా అతని సీటు రద్దు చేస్తే దాన్ని వేరే అభ్యర్థి కోరుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఆ పని చేయలేదు. బీ కేటగిరీ సీట్లలో ఎన్నారైల ఆర్థిక సహకారంతో భర్తీ చేసే 15 శాతం సీట్ల కోటాపైనా రోజుల తరబడి మార్గదర్శకాలు వెలువడలేదు. దీంతో చాలా మంది విట్‌, ఎస్‌ఆర్‌ఎం వంటి ప్రైవేటు కళాశాలలను ఆశ్రయించారు.


సింహభాగం సీఎస్‌ఈనే

చాలా మంది విద్యార్థులు కంప్యూటర్‌ సైన్సు(సీఎస్‌ఈ) సీట్లనే కోరుకున్నారు. సగటున అన్ని కళాశాలల్లో ఈ బ్రాంచిలో ఉన్న సీట్లన్నీ భర్తీ అయ్యాయి. ఆ తర్వాత ఈసీఈ, ఈఈఈ సీట్లకు కొంచెం ఆదరణ ఉందని అధ్యాపకులు తెలిపారు. ఉచిత సీట్లు, ర్యాంకులు రాని వారు మాత్రమే మెకానికల్‌, సివిల్‌ వంటి బ్రాంచిలను తీసుకున్నారు. ఇవి కూడా సింగిల్‌ డిజిట్‌లోనే భర్తీ అయ్యాయని, పేరున్న ఏడెనిమిది కళాశాలల్లోనే పదుల సంఖ్యలో ఈ బ్రాంచిల్లో చేరారని చెబుతున్నారు. కొన్ని కళాశాలలైతే తగినన్ని ప్రవేశాలు లేకుండా ఈ బ్రాంచిలను నడపలేమని ఏఐసీటీఐకి దరఖాస్తు చేసుకుని కౌన్సెలింగ్‌కు ముందే రద్దు చేసుకున్నాయి. దీంతో వారికి ఆ మేరకు ఫీజులు కలిసొచ్చినట్లు అయింది. ప్రవేశాలు ఉన్నా లేకపోయినా సగటున ప్రతి బ్రాంచికి అఫిలియేషన్‌ ఫీజులు చెల్లించాలి. సీఎస్‌ఈ సీట్లకు కొన్ని కళాశాలల్లో బాగా డిమాండ్‌ ఏర్పడింది.


ప్రవేశాలు తగ్గటానికి కారణాలివి..

* కౌన్సెలింగ్‌ నిర్వహణ బాగా ఆలస్యం కావటం.  

* ఏ, బీ కేటగిరీలకు ఒకేసారి కాకుండా వేర్వేరుగా కౌన్సెలింగ్‌ జరిపి సీట్లు కేటాయించడంలో జాప్యం చేయటం.  

* పొరుగునే ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ముందస్తుగా కౌన్సెలింగ్‌కు తెరదీయటం

* స్థానికంగా విట్‌, ఎస్‌ఆర్‌ఎం వంటి ప్రఖ్యాత ప్రైవేటు కళాశాలలు ఉండడం, వాటిల్లో ఇప్పటికే ప్రవేశాలు జరగడంతో డొనేషన్లు చెల్లించి చేరిపోయారు. 

* కరోనా వంటివి దృష్టిలో పెట్టుకుని బయట జిల్లాల నుంచి విద్యార్థులు రాకపోవడం

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని