logo
Published : 01/12/2021 05:44 IST

సంక్షిప్త వార్తలు

జీజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: విజయవాడ జీజీహెచ్‌లో పదిరోజుల కిందట అరుదైన, అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా చేశామని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం ఆయన వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు వాసి జోగిరెడ్డి చిన్నతనం నుంచి  డయాప్రమాటిక్‌ హెర్నియాతో బాధపడుతున్నారు. పూర్తిగా కడుపులో ఉండాల్సిన కాలేయం కుడి వైపు ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో ఆయన ఆయాసంతో పాటు, మంచంపై పడుకోవడానికి, పని చేయడానికి  అవస్థలు పడుతున్నారు. బాధితునికి గుండె జబ్బు ఉండడంతో ఆపరేషన్‌ చాలా ప్రమాదకరమని చెప్పారు. ఒక వేళ చేయించాలనుకున్నా రూ.10 లక్షల వరకు అవుతుందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో జోగిరెడ్డి విజయవాడ జీజీహెచ్‌కు వచ్చారు. ఇక్కడి వైద్యులు రోగికి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం రోగి పరిస్థితి మెరుగ్గా ఉందని, డిశ్ఛార్జి చేశామని వివరించారు. సమావేశంలో డాక్టర్‌ ప్రభాకర్‌, డాక్టర్‌ అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.


వృద్ధుల సంరక్షణ చట్టం తీర్పు ధిక్కారం

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ చట్టం కింద, విజయవాడ రెవెన్యూ డివిజను పరిధిలో నమోదైన కేసుల సత్వర పరిష్కారంపై సబ్‌కలెక్టర్‌, డివిజనల్‌ ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌ జి.ఎస్‌.ఎస్‌. ప్రవీణ్‌చంద్‌ దృష్టిపెట్టారు. మెగా కోర్టు నిర్వహించి, 33 కేసులను విచారించారు. విజయవాడ గ్రామీణ మండలంలో ఒక గ్రామానికి చెందిన తండ్రిని, అతని ఇద్దరు కుమారులు పట్టించుకోవడం లేదు. సంరక్షణ చర్యలు తీసుకోవాలని సబ్‌కలెక్టర్‌ ఇటీవల తీర్పు ఇచ్చారు. దీనిని ధిక్కరించడంతో వారికి రెండు రోజుల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. కస్టడీ నిమిత్తం వీరిని ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. పెనమలూరు మండలానికి చెందిన మరో కేసులో.. తాతను మోసగించి మనవడు ఆస్తి పత్రాలు రాయించుకున్నాడు. సదరు పత్రాలను రద్దు చేయాలని కంకిపాడు సబ్‌రిస్ట్రార్‌ను ఆదేశించారు. తల్లిదండ్రులకు హాని కలిగించవద్దని నాలుగు కేసుల్లో హెచ్చరించగా, మరో నాలుగు కేసుల్లో సమగ్ర విచారణ జరిపి, నివేదిక అందజేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. 11 కేసులకు తీర్పు వెలువరించగా, 14 కేసులను వాయిదా వేశారు. ఈ మేరకు కేసుల వివరాలను మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.


3న ఏపీ ఎన్జీవో జిల్లా కార్యవర్గ సమావేశం

గాంధీనగర్‌(విజయవాడ), న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఏపీ ఐకాస రాష్ట్ర పిలుపు మేరకు ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు డిసెంబరు 3వ తేదీన ఏపీ ఎన్జీవో పశ్చిమ కృష్ణా కార్యవర్గ సమావేశాన్ని గాంధీనగర్‌ ఎన్జీవో భవనంలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్‌ తెలిపారు. ఉద్యోగుల కరవు భత్యం మంజూరు, వేతన సవరణ అమలు, సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర డిమాండ్లపై చర్చించనున్నట్లు చెప్పారు. కార్యవర్గ సమావేశానికి జిల్లా, తాలూకా, ఈసీ సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.


రాష్ట్రంలో అప్పులు ఫుల్‌.. అభివృద్ధి నిల్‌: తులసిరెడ్డి

పటమట, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మ్మోహన్‌రెడ్డి రెండున్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నర్రెడ్డి తులసిరెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. అప్పులు ఫుల్‌, అభివృద్ధి నిల్‌, సంక్షోభంలో సంక్షేమం అన్నట్లుగా పాలన సాగుతోందని విమర్శించారు. వ్యవసాయ, సాగునీటి రంగాలు నిధుల్లేక నీరసించిపోయాయని, ప్రగతి సూచికలైన రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో రగిలిపోతున్నారన్నారు.


హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్థులకు మెరుగైన సేవలు

గాంధీనగర్‌(విజయవాడ), న్యూస్‌టుడే : హెచ్‌ఐవీపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగించడంతో పాటు, బాధితులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని ఏపీ శాక్స్‌ అడిషనల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ డాక్టర్‌ ఉమాసుందరి తెలిపారు. మంగళవారం విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్థుల కోసం ఉచితంగా స్నేహపూర్వక సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఎయిడ్స్‌ నియంత్రణ మండలి కృషి వల్ల బాధితుల సంఖ్య, మరణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పారు. రాష్ట్రంలో లక్షా 91 వేల మందికి ఏఆర్‌టీ కేంద్రాల ద్వారా ఉచితంగా చికిత్స, మందులు అందజేస్తున్నట్లు తెలిపారు. వైఎస్‌ఆర్‌ పింఛను పథకం ద్వారా 32వేల మంది రోగులకు పింఛన్లు ఇస్తున్నామని, మరో 88వేల మందికి త్వరలో మంజూరు చేస్తామని వివరించారు. ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకుని హెచ్‌ఐవీ రహిత సమాజం కోసం కృషి చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు వైద్య, ఆరోగ్య శాకాధికారిణి డాక్టర్‌ జూపూడి ఉషారాణి, ప్రకాష్‌, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.


సీఆర్‌పీఎస్‌ రాష్ట్ర కమిటీ ఎన్నిక

అజిత్‌సింగ్‌నగర్‌, న్యూస్‌టుడే : క్రిస్టియన్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ సొసైటీ (సీఆర్‌పీఎస్‌) రాష్ట్ర కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా డాక్టర్‌ పి.జాన్‌పాల్‌, డాక్టర్‌ పి.జే.కెనడీ బిషప్‌ ఎన్నికయ్యారు. అజిత్‌సింగ్‌నగర్‌లోని సొసైటీ కార్యాలయంలో మంగళవారం కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఎన్నిక నిర్వహించారు. ఉపాధ్యక్షులుగా డి.జీవన్‌కుమార్‌, దొండపాటి జాన్‌ ప్రభాకర్‌, సంయుక్త కార్యదర్శులుగా పి.ప్రభుసాయి, ఎల్‌.ఇజ్రాయిల్‌, కోశాధికారిగా డి.శేఖర్‌ తదితరులను ఎన్నుకున్నారు. సీఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు అప్పికట్ల జీవరత్నం వారికి నియామకపత్రాలు అందజేశారు. కోలవెంటి జాన్‌ అధ్యక్షత వహించారు. జాతీయ నాయకులు పి.వరప్రసాద్‌, జాకబ్‌, ఆగస్థు, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి జాన్‌ మేస్త్రీ, ఉపాధ్యక్షుడు దావూద్‌ బేగ్‌, డి.వి.శివకుమార్‌, బి.జయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


‘సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దు’

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : తుపాను ప్రభావం దృష్ట్యా జిల్లాలోని మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్య శాఖ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో సూచించారు. విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో బోట్లను తీరానికి దూరంగా ఉంచాలని, చేపల వేటకు వెళ్లవద్దని వారు విజ్ఞప్తి చేశారు.


ఉపాధి కల్పనకు మెరుగైన శిక్షణ

మచిలీపట్నం, న్యూస్‌టుడే:ఉపాధి కల్పనకు ఉపయోగపడేలా నిర్వహిస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను విద్యార్థులు వినియోగించుకోవాలని కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతి కె.బి చంద్రశేఖర్‌ అన్నారు. ఇంజినీరింగ్‌ ఆఖరిసంవత్సరం విద్యార్థులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు మంగళవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా శిక్షకులను ఆయన సత్కరించారు. అర్థమెటిక్‌, ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌, బృందచర్చ తదితర అంశాలపై విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చిన శిక్షకుడు రామ్‌బృందాన్ని ఆయన అభినందించారు. రిజిస్ట్రార్‌ రామిరెడ్డి, ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ బాబురెడ్డి పాల్గొన్నారు.


ఉద్యోగులకు వైద్య పరీక్షలు

మచిలీపట్నం, న్యూస్‌టుడే: జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని మంత్రి పేర్ని నాని ప్రారంభించి వైద్యులతో పరీక్షలు చేయించుకున్నారు. డీఈవో తాహెరాసుల్తానా, ఏడీలు సత్యనారాయణమూర్తి, అవధాని, వేణుగోపాలరావు, సూపరింటెండెంట్లు పి.వెంకటేశ్వరరావు, పవన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. సెయింట్‌ఫ్రాన్సిస్‌ ఉన్నతపాఠశాలలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ  ఉద్యోగ విరమణ చేసిన భూపతి విజయఏసు సన్మాన సభలో మంత్రి పాల్గొన్నారు.


డీలక్స్‌ రకాలకే డిమాండ్‌

మిర్చియార్డు, న్యూస్‌టుడే: మిర్చి మార్కెట్ నిలకడగా కొనసాగుతుంది. ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. అరకొరగా ఇప్పుడిప్పుడే వేరే ప్రాంతాల నుంచి నూతన మిర్చి పంట వస్తోంది. మంగళవారం యార్డుకు రైతులు మొత్తం 33,453 బస్తాలను తరలించారు. ఈ-నామ్‌ ద్వారా 33,109 బస్తాలు విక్రయాలు జరిగాయి. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో 9,666 బస్తాలు నిల్వ ఉన్నాయి. డిమాండ్‌ డీలక్స్‌ రకాలకే ఉంది. కామన్‌ వెరైటీ 334, నెంబర్‌ 5, 273, 341, 4884 రకాల మిర్చి సగటు ధర రూ.7,000 నుంచి రూ.15,300 ఉండగా, స్పెషల్‌ వెరైటీ తేజ రూ.7,200 నుంచి రూ.14,900, బాడిగ రూ.7,000 నుంచి రూ.16,000, తాలు మిర్చికి రూ.4,000 నుంచి రూ.8,000 ధర లభించింది.


స్త్రీలపై హింస నివారణ సమాజ బాధ్యత

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: దేశంలో దళిత, గిరిజన మహిళలపై దాడులు నివారించడం సమాజం బాధ్యత అని దళిత స్త్రీ శక్తి జాతీయ కన్వీనర్‌ గెడ్డం ఝాన్సీ అన్నారు. జిల్లాపరిషత్తు ప్రాంగణంలోని పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ సమావేశ మందిరంలో దళిత, గిరిజన మహిళలు, బాలికలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా దళిత స్త్రీ శక్తి ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం జరిగింది. ఆమె మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి దళిత, గిరిజన మహిళలు, బాలికలపై దాడుల నివారణకు 16 రోజులు అంతర్జాతీయ ప్రచారోద్యమానికి పిలుపు ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థ ఇన్‌ఛార్జి ఏపీడీ కృష్ణవేణి మాట్లాడుతూ బాధిత మహిళలు, బాలికలకు అండగా ఉంటున్నామన్నారు. తొలుత కలెక్టరేట్‌ ఎదుట, తర్వాత జిల్లాపరిషత్తు కార్యాలయ ప్రాంగణంలో మహిళలు మానవహారం నిర్వహించారు. సమావేశంలో దళిత స్త్రీ శక్తి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సమన్వయకర్తలు హేమలత, భాగ్యలక్ష్మి, నాయకులు సుజాత, మేరీ నిర్మల, జిల్లాల నాయకులు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని