Stock Market: అంతర్జాతీయ సంకేతాలతో సూచీలు ఆగమాగం!

అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నడుమ ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు అంతకంతకూ దిగజారుతున్నాయి....

Updated : 24 Jan 2022 15:03 IST

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నడుమ ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు అంతకంతకూ దిగజారుతున్నాయి. ఆసియా మార్కెట్ల పతనం, దిగ్గజ షేర్లలో అమ్మకాలు సూచీలను మరింత కిందకు లాగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మధ్యాహ్నం 3:00 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 1,716 పాయింట్ల నష్టంతో 57,321 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 521 పాయింట్లు పడి 17,096 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఏ ఒక్క షేరూ లాభాల్లో చలిచడం లేదు. టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టైటన్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, రిలయన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు అత్యధికంగా నష్టపోతున్న వాటిలో ఉన్నాయి. 

పతనానికి ప్రధాన కారణాలివే..

* గతవారం అంతర్జాతీయంగా దాదాపు అన్ని మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. అమెరికా మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. నాస్‌డాక్‌ ఏకంగా ఇటీవలి గరిష్ఠాల నుంచి 16 శాతం కుంగడం గమనార్హం. ముఖ్యంగా అక్కడి టెక్‌ స్టాక్‌లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి.

* మంగళవారం నుంచి అమెరికాలో ఫెడ్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వడ్డీరేట్ల పెంపు తప్పదని ఇప్పటికే సంకేతాలిచ్చిన ఫెడ్‌.. దాన్ని ఎంత వేగంగా.. ఎన్ని దశల్లో అమలు చేయనుందో ఈ భేటీ స్పష్టం చేయనుంది. ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలోనూ వడ్డీరేట్ల పెంపు వాయిదా లేకపోవడం మదుపర్లను కలవరపరుస్తోంది. 

* రష్యా-ఉక్రెయిన్‌ (Russia-Ukraine) మధ్య కొనసాగుతున్న వివాదంపైనా మదుపర్లు దృష్టి పెట్టారు. యుద్ధ మేఘాలు కమ్ముకొన్న నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని రాయబార కార్యాలయ సిబ్బందిని అమెరికా తగ్గించింది.

* గత వారం విదేశీ సంస్థాగత మదుపర్లు (FII) ఏకంగా రూ.12,600 కోట్లకు పైగా అమ్మకాలకు దిగారు. దేశీయ మదుపర్లు సైతం అదే బాటలో పయనిస్తున్నారు.

* గత ఏడాది కొత్తగా లిస్టయిన కంపెనీలన్నీ భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. లిస్టింగ్‌లో అదరగొట్టిన జొమాటో (Zomato) వంటి షేర్లు ఇష్యూ ధర కంటే 10 శాతం కింద ట్రేడవుతుండడం గమనార్హం. ఇక పేటీఎం (Paytm) షేరు ఏకంగా 50 శాతం నష్టంతో చలిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని