మామ చెప్పిన మాట - Sunday Magazine
close

మామ చెప్పిన మాట

- గంటి వేంకట రమేష్‌

‘‘అమ్మా, నాకు ఉద్యోగం వచ్చింది. ఏడాదికి పదిలక్షల రూపాయల జీతం. నువ్వింక ఉద్యోగం మానేయొచ్చు’’ ఫోన్‌లో తరుణ్‌ మాటలు విని లక్ష్మికి ఏనుగెక్కినంత సంబరం కలిగింది. ‘‘పోన్లే నాయనా, ఇప్పటికైనా దేవుడు కరుణించాడు. మనని ఓ ఒడ్డుకి చేర్చాడు’’ ఆమె గొంతు గద్గదమైంది. ‘‘ఉంటానమ్మా. రాత్రికి బయల్దేరి వచ్చేస్తున్నాను’’ అంటూ ఫోన్‌ పెట్టేశాడు. నిజంగా ఇవాళ ఎంతో ఆనందించాల్సిన రోజు. పదిహేనేళ్ల కిందట తండ్రి చనిపోయినప్పుడు అమ్మ ముఖంలో నవ్వు ఆరిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు ఆమెకు కాస్త తృప్తి దక్కి ఉంటుంది. ఓ చిన్న కంపెనీలో ప్రైవేట్‌ ఉద్యోగం చేసే వ్యక్తి చనిపోతే అతని భార్యా, పిల్లల జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో మాటల్లో చెప్పలేం.

ఫోన్‌ రింగవడంతో తరుణ్‌ ఆలోచనలకు బ్రేక్‌ పడింది. వినోద్‌ నుంచి ఫోన్‌.
‘‘బావా, నీకే ఫోన్‌ చేద్దామనుకుంటున్నాను.’’
‘‘నీ ఇంటర్వ్యూ ఏమైంది.’’
‘‘సెలెక్ట్‌ అయ్యాను బావా. పది లక్షల ప్యాకేజీ.’’
‘‘హే! కంగ్రాట్స్‌. పార్టీ ఎప్పుడు?’’
‘‘నీ ఇష్టం బావా’’
‘‘మనందరం మరో పార్టీ కూడా చేసుకోవాలి. సుమ మగపెళ్లివాళ్లకు బాగా నచ్చిందట. ముహూర్తాలు పెట్టుకోడానికి వస్తామన్నారు. కట్నం వద్దన్నారు. కానీ పెళ్లి గ్రాండ్‌గా చేయాలంట’’ వినోద్‌ చెప్పుకుంటూ పోతున్నాడు.
‘‘ఎంత బావా బడ్జెట్‌?’’
‘‘నీ ఏడాది జీతమంత’’ నవ్వుతూ చెప్పాడు వినోద్‌.
‘‘పది లక్షలా?’’ నోరు వెళ్లబెట్టాడు.
‘‘తప్పదు బాబూ, మంచి సంబంధం చేస్తేనే కదా మన ఆడపిల్ల సుఖపడేది.’’
‘‘కానీ అంత డబ్బు...’’ మధ్యలోనే మాటని మింగేశాడు తరుణ్‌.
‘‘నేను పర్సనల్‌ లోనుకి అప్లై చేస్తాను. ప్రతి నెలా వాయిదాలు నువ్వు కట్టుకో.’’
‘‘ఓహ్‌, థ్యాంక్స్‌ బావా. నీకు చాలా రుణపడిపోతున్నాం.’’
‘‘అలాగే కానీ, మా బాస్‌ ఫోన్‌ చేస్తున్నాడు. సాయంత్రం మాట్లాడదాం’’ అంటూ ఫోన్‌ పెట్టేశాడు తరుణ్‌.

తన తండ్రి అప్పులతోపాటూ వెలకట్టలేని ఆస్తిని కూడా ఇచ్చే వెళ్లిపోయాడు. ఆ ఆస్తి పేరే వినోద్‌. తన మేనత్త కొడుకు. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న వినోద్‌ని మేనమామ ఆనందరావు కన్నకొడుకులా చూసుకున్నాడు. వినోద్‌ పదో ఏట ఆనందరావుకు లక్ష్మితో పెళ్లయింది. భర్తకు చాలీచాలని జీతం మూలాన వదినగారి కొడుకు ఆమెకు భారంగా తోచేవాడు. వినోద్‌ తెలివైనవాడు కావడంతో స్కాలర్‌షిప్‌ వచ్చేది. అది ఫీజులకు సరిపోయేది. అయినా పుస్తకాలకీ, పరీక్షలకూ అంటూ ఖర్చులు ఉంటూనే ఉండేవి. ఓ మూడేళ్లలో తమకు ఇద్దరు పిల్లలు వచ్చి చేరారు. వాళ్ల చదువులు కూడా ఆనందరావు ఖర్చుకు తోడయ్యాయి. అప్పో సొప్పో చేసుకుంటూ సంసారాన్ని నెట్టుకు వచ్చేవాడు.

వినోద్‌ డిగ్రీ చివరి సంవత్సరంలో ఉండగా రోడ్డు ప్రమాదంలో ఆనందరావు కన్నుమూశాడు. చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితుల్లో లక్ష్మి తన అన్న త్రిమూర్తులు ఇంటికి చేరింది. అతని పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండడం, మరో ముగ్గుర్ని అదనంగా పోషించాల్సి రావడంతో ఆమె వదిన అగ్గిమీద గుగ్గిలం అయిపోయేది. చీటికీ మాటికీ లక్ష్మినీ, పిల్లల్నీ తూలనాడుతూ ఉండేది.

వినోద్‌ డిగ్రీ పూర్తి చేసి, ఉద్యోగంలో చేరిన తర్వాత లక్ష్మి కుటుంబాన్ని చూడటానికి వెళ్లాడు. పనిమనిషి కంటే దారుణంగా తయారైన ఆమె పరిస్థితిని చూసి బాధపడ్డాడు. మాసిపోయిన బట్టలతో కనిపించిన మేనమామ పిల్లలను చూసి అతనికి కళ్లంట నీళ్లు తిరిగాయి.

‘‘ఏం నాయనా, మేనమామ పెళ్లాం ఇప్పటికి గుర్తొచ్చిందా. మేమే ఇబ్బందులు పడుతుంటే ఈ దిక్కుమాలిన దరిద్రం కూడా దాపురించింది మా ఇంటికి’’ అంటున్న లక్ష్మి వదినగారి దెప్పిపొడుపులతో వినోద్‌కి పరిస్థితి అర్థమైంది.

‘‘చివరికి మా కర్మ ఇలా కాలింది. చెడి పుట్టింటికి వెళ్లకూడదు. మీ మామయ్య ఊరందరికీ దోచిపెట్టి నా పిల్లల్ని అనాథల్ని చేశాడు’’ అంటూ ముక్కు చీదుకుంది లక్ష్మి. ఆమె పరోక్షంగా తననే నిందిస్తోందని తెలిసినా, వినోద్‌ ఏమీ మాట్లాడలేదు. ఆ పరిస్థితుల్లో ఎవరున్నా అలాగే మాట్లాడుతారని అనుకున్నాడు.

‘‘అత్తా, నేనో మాట చెబుతాను. ఏమీ అనుకోకండి. మీరు ఇంటర్‌ వరకూ చదివారు కదా. ఓ చిన్న ఉద్యోగం చూస్తాను. పిల్లల చదువుల విషయం నేను చూసుకుంటాను. మీరు ఇక్కడ నుంచి వచ్చేయండి. ఇన్ని మాటలు పడుతూ ఉండే కంటే అర్ధాకలితో అయినా స్వతంత్రంగా ఉండటం మేలు. నేనున్నాననే విషయం మరిచిపోకండి.’’

ఆ ఒక్కమాట లక్ష్మికి కొండంత భరోసానిచ్చింది. పిల్లలను తీసుకుని తక్షణమే వినోద్‌ వెంట బయలుదేరింది. ఓ చిన్న ఇల్లు తీసుకుని ఉద్యోగంలో చేరింది. తమ ముగ్గురి పోషణ వరకూ తాను సంపాదించుకుంది. పిల్లల చదువు బాధ్యతను వినోద్‌ తీసుకున్నాడు. తను ఉద్యోగాల వేటలో వేరే ఊరికి వెళ్లినా, పెళ్లయి ఇద్దరి పిల్లల తండ్రయినా తన బాధ్యతను మరిచిపోలేదు. వినోద్‌ భార్య పల్లవికి... తన భర్తకు మేనమామ కుటుంబం అంటే ఉన్న ఆపేక్ష తెలుసు. తరుణ్‌, సుమా కూడా ఆమెని సొంత అక్కలానే భావిస్తారు. తరుణ్‌కి ఉద్యోగం రావడం, సుమ పెళ్లి కుదరడం ఒకేసారి జరిగాయి.

‘‘వినోద్‌ మా మేనల్లుడైనా, నాకు పెద్దకొడుకు లాంటివాడు. ఏ విషయమైనా వాడితోనే మాట్లాడండి. వాడిమాటే నామాట’’ మగ పెళ్లి వాళ్లకు చెప్పింది లక్ష్మి.

లక్ష్మి అన్నయ్య త్రిమూర్తులును కూడా పెళ్లికి పిలుద్దామన్నాడు వినోద్‌. కానీ లక్ష్మి మాత్రం ససేమిరా అంది. ‘‘నేను, నా ఇద్దరు పిల్లలతో వాళ్ల గడప దిగిన నాటినుంచి ఈ రోజు వరకూ వాళ్లు నన్ను పట్టించుకోలేదు. ఏదో నువ్వు ఉండబట్టి సరిపోయింది. లేకపోతే నేనూ నా పిల్లలం ఏమయ్యేవాళ్లం?’’ లక్ష్మి దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది.

‘‘మామయ్యా మీరూ లేకపోతే నేను ఏమయ్యేవాడిని? అతను మీ తోడబుట్టిన అన్నయ్య. పెళ్లిలో పెద్దదిక్కు లేకపోతే ఎలా?’’ వినోద్‌ మాటలు ఆమెను కన్విన్స్‌ చేయలేదు కానీ, అతని మాటను కొట్టి పారేయడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయింది.

సుమ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.

‘‘లక్ష్మీ, ఇన్నాళ్లూ నువ్వేమయ్యావని కూడా నేను పట్టించుకోలేదు. నన్ను క్షమించమ్మా’’ అంటున్న వదిన మాటల కంటే పక్షవాతంతో ఎడమ చేయీ, కాలూ పడిపోయిన త్రిమూర్తులును చూసి లక్ష్మి చలించిపోయింది. ఇంటి పరిస్థితి గాడి తప్పడంతో, లేక లేక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు అజయ్‌ పదోతరగతిలోనే చదువు ఆపేశాడు. మొబైల్‌ గేమ్స్‌ ఆడుకుంటూ సమయాన్ని వృథా చేస్తున్నాడు.

‘‘వాడిని మళ్లీ చదువు దారిలోకి మళ్లించలేమా’’ పెళ్లి హడావుడి ముగిసిన తర్వాత తరుణ్‌ని అడిగాడు వినోద్‌.

‘‘వాళ్లింట్లో ఉన్న ఆర్నెల్లూ మేము అనుభవించిన నరకం నాకింకా గుర్తుంది బావా. వాళ్లకు తగిన శాస్తి జరుగుతోంది’’ అక్కసుగా అన్నాడు తరుణ్‌.

‘‘తరుణ్‌, మీ నాన్న నాకెప్పుడూ ఓ మాట చెప్పేవాడు... ‘మనం ఈ ప్రపంచాన్ని ఉద్ధరించక్కర్లేదు కానీ, మనవాళ్లు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కాస్త సాయపడితే అదే పదివేలు. దీనికి మనం కోటీశ్వరులం కానక్కర్లేదు, కాస్త మనసుంటే చాలు. సాయం చేయడం కూడా అంటువ్యాధి లాంటిదే. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది...’ అని. అలా చెప్పడమే కాకుండా ఆయన ఆచరణలో చేసి చూపించాడు. తను సంపాదించిన నాలుగు రూపాయల్లోనే నన్ను కన్నకొడుకులా చూసుకుని, నా జీవితాన్ని నిలబెట్టాడు. దీనివల్ల మీరు కొన్ని సౌకర్యాల్ని కోల్పోవాల్సి వచ్చింది కూడా.’’

‘‘అంతకంటే ఎక్కువే మాకు సాయం చేశావు కదా బావా.’’

‘‘అవును, ఆ సాయం వెనుక మీ నాన్న మాటలే స్ఫూర్తిగా నిలిచాయి. ఇప్పుడు నీ మేనమామ ఇబ్బందుల్లో ఉన్నాడు. అజయ్‌ తెలివైనవాడిలాగానే కనిపిస్తున్నాడు. కాస్త దారిలో పెడితే వాడి భవిష్యత్తుకు ఢోకా ఉండదు. సాన పెడితేనే ఏ వజ్రమైనా ప్రకాశిస్తుంది. వాడికీ మంచి జీవితాన్ని ఇవ్వగలిగితే, మరొకరికి సాయం చేసే అవకాశం వాడికి కూడా దక్కుతుందేమో! ఆలోచించు’’ వినోద్‌ మాటల్లోని వాస్తవికత తరుణ్‌ని ఆలోచనలో పడేసింది.

‘‘మామయ్యా, అజయ్‌ని నా దగ్గరే ఉంచు. వాడిని మంచి కాలేజీలో జాయిన్‌ చేస్తాను. ఖర్చు వివరాలు తర్వాత చూసుకుందాంలే’’ అంటున్న తరుణ్‌ని చూసి త్రిమూర్తులుకు నోటమాట రాలేదు.

‘‘వద్దులే నాయనా. ఇప్పటికే మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. మళ్లీ ఈ భారం కూడా మీకెందుకు? మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మేం ఉండి కూడా లేని వాళ్లమయ్యాం. నీ సాయం తీసుకునే అర్హత కూడా మాకు లేదు.’’

‘‘ఇది అర్హతల గురించి మాట్లాడే టైం కాదు. నీ ఒక్కగానొక్క కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచించాలి. వాడిని ఇక్కడ వదిలివెళ్లు. నేను చూసుకుంటాను’’ అంటూ తల్లివైపు చూశాడు. అతని నిర్ణయాన్ని అంగీకరిస్తున్నట్లు లక్ష్మి కళ్లలో వెలుగు కనిపించింది.

‘‘నీ కొడుకు బంగారం లక్ష్మీ. మీ మేలు ఈ జన్మలో...’’ అంటున్న వదిన మాటల్ని మధ్యలోనే ఆపేసింది లక్ష్మి.

‘‘అయినవాళ్లు బాగుపడితే, మనం బాగుపడ్డట్లే కదా వదినా’’ అంటూ వారిని సాగనంపింది.

‘‘అత్తా, అజయ్‌ని ఇక్కడ చదివించడానికి నువ్వు అంగీకరిస్తావనుకోలేదు.’’

‘‘నువ్వు తరుణ్‌తో అన్నమాటలు- అదే మీ మామ చెప్పిన మాటలు- విన్నాను వినోద్‌. నిజమే, కష్టమో నష్టమో మనవాళ్లను మనమే ఆదుకోవాలి. అప్పుడే నీలాంటి మాణిక్యాలు తయారవుతారు. అంతకు మించి మనం లోకాన్నేమీ ఉద్ధరించక్కర్లేదు’’ నవ్వుతూ అంది లక్ష్మి.

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న