నీ చిత్రం చూసి.. నా చిత్తం చెదిరి.. - Sunday Magazine
close

నీ చిత్రం చూసి.. నా చిత్తం చెదిరి..

చెబితే నమ్మరుకానీ... మనుషుల్లానే కొన్ని పాటలకీ బరువూ బాధ్యతలెక్కువ! ఓ కీలకమైన సందర్భంలో వచ్చి ప్రేక్షకుల్ని కదలించడం ఒక్కటే కాదు... మొత్తం కథనీ ఆరేడు కవితావాక్యాల్లో అవి వివరించాల్సి ఉంటుంది. అతితక్కువ పదాలతోనే అందులోని ఉద్వేగాన్ని పండించాల్సి వస్తుంది. దర్శకుడు శేఖర్‌ కమ్ముల ‘లవ్‌స్టోరీ’ సినిమాలోని ‘నీ చిత్రం చూసి...’ ఆ తరహా పాటే. అలాంటి బరువైన బాధ్యతని తొలిసారి మోసిన అనుభవాన్ని వివరిస్తున్నారు... యువగేయ రచయిత మిట్టపల్లి సురేందర్‌.

దేళ్లకిందట ‘పోరుతెలంగాణ’ సినిమాలోని ‘రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా...!’, ఆ మధ్య వచ్చిన ‘రాజన్న’లోని ‘కాలిగజ్జె ఘల్లుమంటే...’ పాటలే... నిన్నామొన్నటిదాకా నా చిరునామాలు! నేను ప్రైవేటుగా రాసిన పాటలు యూట్యూబ్‌లో ఉండటంవల్ల ఎక్కువగా పల్లెపాటలూ, విప్లవగీతాలు మాత్రమే రాస్తాననే ముద్ర నాపైన పడిపోయింది. అవి విన్న శేఖర్‌ కమ్ముల సార్‌ నన్ను ‘హీరో ఇంట్రడక్షన్‌ సాంగ్‌’ కోసం పిలిచారు. అందుకోసం ప్రయత్నిస్తూ నేను ఆయనతో మాటల్లో పడ్డాను. నేను రాసిన ఇతరత్రా కవితలూ, గేయాల గురించి విని... ‘అయితే, ఇందులో థీమాటిక్‌ సాంగ్‌ ఒకటుంది. దానికి ప్రయత్నిస్తారా!’ అని అడిగారు. అంతకంటే ఏం కావాలి... ఎగిరిగంతేశాను. దాదాపు గంటపాటు నాకు ‘లవ్‌ స్టోరీ’ కథని కళ్లకుగట్టినట్టు చెప్పారు శేఖర్‌సార్‌. కథప్రకారం నాయికానాయకుల ప్రేమని ఒప్పుకోని పెద్దవాళ్లు... ఓ అసాధ్యమైన షరతుపెట్టి అందుకు గడువూ విధిస్తారు! ఆర్థికంగా ఉన్నతికి చేరుకుంటే తప్ప ప్రేమని గెలుచుకోలేమని భావించిన హీరో అందుకోసం విదేశాలకి ప్రయాణమవుతాడు. అతనికి వీడ్కోలు చెప్పడానికి హీరోయిన్‌ వస్తుంది. ఇద్దరు వీడలేక వీడలేక విడిపోతారు. ఈ సందర్భంలో ‘డైరెక్టర్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూ’లో ఇద్దరి మనోభావాలతోపాటూ... కథలోని థీమ్‌నీ పాటలో చెప్పాలన్నారు దర్శకుడు. ముందు నాయిక కోణంలోనే పల్లవిని మొదలుపెట్టి- హీరో రూపాన్ని కళ్లముందు నిలుపు
కుంటున్నట్టు ‘నీ చిత్రం చూసి... నా చిత్తం చెదిరి... నే చిత్తరువైతిరయ్యో! ఇంచు ఇంచూలోన... పొంచి ఉన్నా ఈడు నిన్నె ఎంచూకుందిరయ్యో...’ అని పల్లవి రాశాను. అనుపల్లవిగా ఓ చిన్న హైకూలాంటి కవిత చెప్పొచ్చు అనిపించింది. పెళ్లైన కొత్తల్లో... భర్త గుండెలపైన పడుకుని అక్కడి రోమాల్ని వేళ్లతో అల్లరిగా సవరించడం అమ్మాయిలకి ఓ అందమైన అనుభవం. వేళ్లతో అలా సున్నాలు చుట్టడాన్ని కాసేపు ముగ్గులేయడంగా ఊహించుకున్నాను. ‘ఆ ముగ్గులేవో ఇప్పుడు నేను నా ఇంటి ముందే వేస్తున్నాను... వాటిని నీ గుండెలపైన వేసే రోజు రావాలి!’ అనేలా... ‘నా ఇంటి ముందు/రోజు వేసే ముగ్గు/నీ గుండెమీదనే వేసుకుందు...’ అంటూ రాశాను.

ఆ రణగొణ ధ్వనులే...
కథ ప్రకారం నాయిక అతనికి వీడ్కోలు చెప్పి బస్సులో వెళుతోంది. చుట్టూ ఉన్న రణగొణ ధ్వనులు వింటూ ఉంది కాబట్టి ‘ఈ దారిలోని గందరగోళాలే మంగళవాయిద్యాలుగా చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో మన పెళ్ళీ మంత్రాలుగా’ అని తొలి చరణం పూర్తిచేశాను. ఇక హీరో వంతు. అతనికీ ‘ఎంత చిత్రం ప్రేమ/వింత వీలునామ’ అంటూ కొత్త పల్లవి ఇచ్చాను. పెద్దవాళ్లు ఇచ్చిన గడువుకన్నా ముందే వచ్చి నీ చేయిపడతానని చెప్పేలా ‘ఈ కాలంకన్నా ఒక క్షణం ముందే నే గెలిచి వస్తానని’ అని రాశాను. ఆమె బస్సులో  ప్రయాణిస్తుంటే అతను విమానంలో వెళ్తున్నాడు కదా! అందుకే అతని చుట్టూ ఉన్న మబ్బుల్ని సూచించేలా ‘నీలి మేఘాలన్నీ పల్లకిగా మలచి నిను ఊరేగిస్తానని’ అని చెప్పాను. అదే భావాన్ని విస్తరిస్తూ ‘ఆకాశమంత మన ప్రేమలోన ఏ చీకటైన క్షణకాలమంటూ... నీ నుదుటి తిలకమై నిలిచిపోవాలని’ అంటూ ఈ చరణాన్ని ముక్తాయించాను. శేఖర్‌గారు రెండు చరణాలూ చూశాక-‘అంతా బావుంది కానీ... ఇంత మంచి తెలుగు పాట పల్లవిలో ‘ఇంచు’ అనే ఇంగ్లిషుపదం అవసరమా?’ అన్నారు. నేను జవాబు చెప్పేలోగా ‘ఓకే! రైలూ బస్సూలాగా అదికూడా ఇప్పుడు తెలుగుపదంలాగే మారిపోయింది!’ అని నవ్వేశారు. అలా... నా పాటని ఒక్క సవరణ కూడా లేకుండా ఓకే చెప్పారు!

ఈ పాటని ఫిబ్రవరి 14న విడుదలచేసింది సినిమా బృందం! కొత్త సంగీత దర్శకుడు పవన్‌ సీహెచ్‌ మెలొడీ బాణీ యువత గుండెల్ని హత్తుకోవడంతో అతికొద్ది కాలంలోనే రెండున్నర కోట్ల వ్యూస్‌ని దాటిందీ పాట. అంతేకాదు, గీతరచయితగా పరిశ్రమలో నాకు మంచి స్థానాన్నిచ్చింది... ఐదు పెద్ద బ్యానర్లు సహా వరసగా 14 సినిమాలకి పాటలు రాసే అవకాశాన్ని కల్పించింది!

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న