Madakasira: ఇక్కడ స్వామికి... మాంసమే నైవేద్యం - Sunday Magazine
close

Madakasira: ఇక్కడ స్వామికి... మాంసమే నైవేద్యం

శివుడికి నివేదించే పదార్థాల్లో పంచామృతం నుంచీ పండ్లూ, ఇతర అన్న ప్రసాదాల వరకూ ఎన్నో ఉంటాయి. కానీ నీలకంఠపురంలో కొలువైన నీలకంఠేశ్వరుడికి మాత్రం మాంసాన్ని నైవేద్యంగా సమర్పించడం ఓ సంప్రదాయం. ఇతర ఉపాలయాలూ ఉన్న ఈ ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది.

విశాలమైన వాతావరణంలో చుట్టూ పచ్చదనం మధ్య కనిపించే నీలకంఠేశ్వరుడి ఆలయంలో శివుడు స్వయంభువుగా వెలిశాడని అంటారు. వరంగల్లు వేయి స్తంభాల మంటపం తరహాలో 162 మూల స్తంభాలతో నిర్మించిన ఆలయ కట్టడం, అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయ ప్రవేశద్వారాన్ని పోలిన ప్రవేశ ద్వారాన్ని ఈ క్షేత్రంలో చూడొచ్చు. ఆకట్టుకునే నిర్మాణశైలితో కనిపించే ఈ ఆలయంలోని స్వామికి మాంసాన్ని నివేదిస్తారు. అనంతపురం జిల్లా పెనుగొండలోని మడకశిరలో ఉన్న ఈ క్షేత్రాన్ని భక్తులే స్వయంగా నిర్మించారని ప్రతీతి.

స్థలపురాణం
సుమారు పన్నెండువందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో శివలింగం, మహిషాసురమర్దిని, ఆంజనేయుడి విగ్రహాలు ఉండేవట. కొన్నాళ్లవరకూ అవి ఎలా, ఎక్కడినుంచి వచ్చాయో ఆ ఊరివాళ్ళు తెలుసుకోలేకపోయారట. అయితే పోతుగుండు అనే పట్టణం శిథిలం కావడంతో అక్కడ ఉండేవాళ్లంతా వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిపోయారట. అలా ఆ ఊరివాళ్లలో కొందరు ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారట. వాళ్లే ఇక్కడున్న విగ్రహాలను గుర్తించి, చిన్న ఆలయంలా నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారట. శివుడిని నీలకంఠుడిగా కొలవడం వల్ల ఈ ఊరికి కూడా నీలకంఠపురం అనే పేరు పెట్టుకున్నారట. ఆ విగ్రహాలు స్వయంభువుగా వెలిశాయనడానికి ఆనవాళ్లు లభించినట్లు పురావస్తుశాఖ అధికారులు కొంతకాలం క్రితం నిర్థారించారు. ఈ ప్రాంగణంలో ఇతర ఉపాలయాలూ ఉన్నా ఏళ్లు గడిచేకొద్దీ అవి శిథిలమయ్యాయనీ, ఒక్క శివాలయం మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉందనీ స్థానికులు చెబుతారు. ఏ భక్తుడు ప్రారంభించాడో తెలియదు కానీ భక్త కన్నప్ప స్ఫూర్తితోనే స్వామికి ఇక్కడ మాంసాన్ని నివేదించే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోందని అంటారు. అలా నైవేద్యంగా పెట్టడం వల్లే ఇక్కడ స్వామిని మునీశ్వరుడనీ పిలుస్తారు భక్తులు. కొన్ని వందల ఏళ్ల నుంచీ ఈ ఆలయ బాధ్యతల్ని మాజీ మంత్రి రఘువీరారెడ్డి వంశస్థులే చూడటం వల్ల ఇప్పటికీ అదే కొనసాగుతోంది.

లక్షకుపైగా ఇటుకల్ని సేకరించి...
కొంతకాలం క్రితం ఈ ఆలయం జీర్ణస్థితికి చేరుకోవడంతో మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఈ క్షేత్రాన్ని పునర్నిర్మించాలనుకున్నారు. దాంతో మడకశిరలోని 5 మండలాల్లోని ప్రజల నుంచి ఇటుకల్ని సేకరించి వాటితో ఆలయాన్ని అత్యాధునికంగా నిర్మించారు. అలా సేకరించిన ఇటుకల్లో ముందుగా  కొన్నింటిని తిరుపతి, శ్రీశైలం, మహానంది, కనకదుర్గ, శిరిడీ, భద్రాచలం, సింహాచలం వంటి 26 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో పూజలు చేయించారు. అదేవిధంగా పుణ్యనదుల నుంచి నీటిని తెప్పించి మరీ ఈ ఆలయ నిర్మాణంలో ఉపయోగించారు. ఇక్కడ ప్రధాన ఆలయం నీలకంఠేశ్వరుడిది అయినా... ఇతర దేవతలతో ఉపాలయాలూ ఉంటాయి. ఆలయ ప్రాంగణంలో ఉన్న 52 అడుగుల పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం దర్శనంతోనే పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఐదు ఎకరాల్లో నిర్మించిన నీలకంఠేశ్వరస్వామి క్షేత్రంలో ఏటా శ్రీరామనవమికి నిర్వహించే జాతరను చూసేందుకు రెండు కళ్లూ చాలవంటారు. అదేవిధంగా దసరా సమయంలో చేసే ఉట్ల పరుసు, ఎడ్లబండ్ల జాతరలో పాల్గొనేందుకు భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలి రావడం విశేషం. ఇవి కాకుండా శివరాత్రి, కార్తికమాసం సమయంలో చేసే ప్రత్యేక పూజలూ అభిషేకాలూ కన్నులపండుగ్గా ఉంటాయని చెబుతారు భక్తులు. 

ఎలా చేరుకోవచ్చు  
ఈ ఆలయానికి రైల్లో రావాలనుకునేవారు పెనుకొండ వరకూ వచ్చి అక్కడి నుంచి మడకశిరకు బస్సు లేదా ప్రైవేటు వాహనాల్లో చేరుకోవాల్సి ఉంటుంది. మడకశిర నుంచి నీలకంఠపురంపదికిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

- అంజప్ప, ఈనాడు డిజిటల్‌, అనంతపురం

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న