పప్పీకీ పెళ్లికూతురికీ మ్యాచింగ్‌ మ్యాచింగ్‌! - Sunday Magazine
close

పప్పీకీ పెళ్లికూతురికీ మ్యాచింగ్‌ మ్యాచింగ్‌!

‘నా పెళ్లి చీరలాంటి క్లాతే కొనండి. సరిగ్గా కొలతలు తీసుకుని నీట్‌గా కుట్టండి. ఆ డ్రెస్సుతో అందరిలో అది బుజ్జి బుజ్జిగా నడుస్తుంటే భలేగా ఉంటుంది. పెళ్లిలో మేమిద్దరమూ మ్యాచింగ్‌ మ్యాచింగ్‌ ఉండాలి మరి’ - ఈ సంభాషణను విని అదంతా ఏ చిన్నారి పాపాయి గురించో అనుకుంటున్నారా... కాదండీ బాబూ ఆ ఇంట్లోని పప్పీ సంగతి. ఈమధ్య వాటినీ పెళ్లివేడుకల్లో పట్టుపరికిణీలతో చూడముచ్చటగా ముస్తాబుచేస్తున్నారు.

కప్పుడంటే కుక్కలనగానే ఇంటి కాపలాకే, కానీ ఇప్పుడు అవీ ఇంట్లో మనుషుల్లా మారిపోయాయి. అందుకే ముద్దుముద్దుగా ఉండే బుజ్జికుక్కలకీ చిట్టిపాపాయిలకులానే స్నానం చేయించి చక్కగా డ్రెస్సు వేసి సంతోషపడుతుంటారు డాగ్‌ లవర్స్‌. అంతేనా... కొంతమంది వాటికీ బోలెడన్ని హెయిర్‌స్టైల్సూ వేసేస్తుంటారు. అందుకే కుక్కల ఫుడ్‌లోనే కాదు వాటిని అందంగా తయారు చేయడానికీ మార్కెట్లో కార్టూన్‌ క్యారెక్టర్ల ఫ్యాషన్‌ దగ్గర్నుంచి సంప్రదాయ దుస్తుల వరకూ ఎన్నో రకాల డ్రెస్సులొస్తున్నాయి. వాటికి తగ్గట్టు బెల్టులూ, టోపీలూ, ఇతర యాక్సెసరీలూ దొరికేస్తున్నాయి. అయితే ఇదంతా పాత మాట. ఇప్పుడైతే డాగ్‌ లవర్స్‌ మరో అడుగు ముందుకేసి పెట్స్‌ మీదున్న ప్రేమను ఇంకాస్త ఎక్కువగా ప్రదర్శిస్తున్నారు. ఇంట్లో జరిగే వివాహ వేడుకల్లో తమ పెంపుడు కుక్కలూ ప్రత్యేక ఆకర్షణగా కనిపించాలనే ఉద్దేశంతో మ్యాచింగ్‌ డ్రెస్సులు కుట్టిస్తున్నారు. పెళ్లి సందర్భంగా పెళ్లికూతురు దగ్గర్నుంచి ఇంట్లో అమ్మానాన్నా అన్నయ్యా తమ్ముడూ... ఇలా ఇంటిల్లిపాదీ ఏరికోరి బట్టలు తీసుకున్నట్టే వాటికీ ఎంచిఎంచి కొంటున్నారు. పట్టుచీరా, గాగ్రా చోళీ, గ్రాండ్‌ లెహెంగా... ఇలా పెళ్లికూతురు ఏ డ్రెస్సులో రెడీ అయినా సరే, వాటికి జతగా ఉండేలా పప్పీల కోసమూ సంప్రదాయ దుస్తుల్ని కొనడమో, లేదంటే కుట్టించడమో చేస్తున్నారు.

అదిరేటి డ్రెస్సు నే వేస్తే...

వధువుతో పాటుగా నారింజ రంగు పట్టు డ్రెస్సు వేసుకుని మెరిసిపోయే కుక్కగారు పెళ్లిలో అటూ ఇటూ వెళుతుంటే ఇష్టమున్నవాళ్లు ముద్దుచేయకుండా ఉంటారా! పెళ్లికూతురి లాంటి పూలపూల డిజైన్‌ గౌను వేసుకుని ప్రేమగా చేతులు అందిస్తున్న బుజ్జికుక్కపిల్లను చూస్తే ఎవరైనా సరే, ‘అరె పెంపుడు కుక్కనీ ఇంత చక్కగా ముస్తాబు చేశారా’ అంటూ ఆశ్చర్యపోకుండా ఉండగలరా. అందుకే వివాహానికి వచ్చిన అతిథుల మధ్యన పెళ్లి సందడిలో ఏమాత్రం తగ్గకుండా తమ పెంపుడు కుక్కల్నీ రెడీ చేస్తూ ‘నా పప్పీ నేనూ సేమ్‌ టు సేమ్‌’ అంటూ ఫొటోలకు పోజులిస్తున్నారు. వాటినీ పెళ్లి వేడుకల్లో ఓ భాగం చేసుకుంటున్నారు!

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న