కొత్త వివాదానికి తెరలేపారు: బుద్ధ ప్రసాద్‌

తాజా వార్తలు

Published : 19/07/2021 12:00 IST

కొత్త వివాదానికి తెరలేపారు: బుద్ధ ప్రసాద్‌

అకాడమీలకు అధ్యక్షులుగా సంబంధం లేని వారిని నియమించారు

ఏపీ ప్రభుత్వంపై మాజీ ఉప సభాపతి విమర్శలు

అందరూ స్పందించాలని పిలుపు

అవనిగడ్డ: రాష్ట్రంలో ప్రస్తుతమున్న తెలుగు- సంస్కృత అకాడమీ సమస్యను పరిష్కరించకుండానే కొత్త వివాదానికి ఏపీ ప్రభుత్వం తెరలేపిందని శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌ ఆరోపించారు. తెలుగు భాషా సంస్కృతులపై ప్రభుత్వం అవగాహనలేమితో వ్యవహరిస్తోందో.. కుట్రపూరితంగానో అర్థంకాని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా సాహిత్య, సంగీత, నృత్య, లలిత కళలు, చరిత్ర అకాడమీలకు ఆయా రంగాలకు సంబంధం లేని వారిని అధ్యక్షులుగా ప్రకటించారని ఆయన ఆక్షేపించారు.

‘‘ఏ జాతి ఔన్నత్యం అయినా ఆ జాతి సంస్కృతి, సాహిత్యంపై ఆధారపడి ఉంటుంది. మన తెలుగు జాతికి సమున్నత సాంస్కృతిక ఔన్నత్యం ఉంది. దేశంలో కళలు, సాహిత్యాన్ని పరిపోషించేందుకు తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అకాడమీలను నెలకొల్పారు. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అకాడమీలు ఏర్పాటు చేశాయి. వాటికి ఆయా రంగాల్లోని నిష్ణాతులను అధ్యక్షులుగా నియమించేవారు. ఏపీలో సాహిత్య అకాడమీకి డాక్టర్‌ బెజవాడ గోపాల్‌రెడ్డి, దేవులపల్లి రామానుజరావు, సంగీత అకాడమీకి మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నృత్య అకాడమీకి నటరాజ రామకృష్ణ, లలిత కళా అకాడమీకి పీటీ రెడ్డి వంటి లబ్ధ ప్రతిష్ఠులు అధ్యక్షులుగా పనిచేశారు. ఆయా రంగాల్లో వారు తెలుగుజాతి ఖ్యాతిని ఇనుమడింపజేశారు. దురదృష్టవశాత్తు సీఎం జగన్‌ ఈ చరిత్రను గమనించకుండా ఆయారంగాలతో సంబంధం లేని వారిని నియమించి అందరినీ దిగ్భ్రమకు గురిచేశారు. 

ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్న కవులు, కళాకారులు అనేకమంది ఉన్నారు. వారెవరినీ పరిగణనలోకి తీసుకోలేదంటే భాష, జాతి పట్ల ఎంత చులకన భావముందో అర్దమవుతోంది. వివిధ రాష్ట్రాల అకాడమీల అధ్యక్షులుగా విశిష్ట వ్యక్తులున్నారు. వారికి సరితూగే వారిని నియమించకపోతే నవ్వుల పాలవుతామన్న ఆలోచన రాకపోవడమే విచిత్రం. తెలుగు భాషా సంస్కృతుల విధ్వంసానికి ప్రభుత్వమే పూనుకుంటూ ఉంటే  చూస్తూ కూర్చోవడం వల్ల జాతి అస్థిత్వమే ప్రశ్నార్థకమవుతుంది. భాషా సంస్కృతుల ఔన్నత్యాన్ని నిలుపుకోవటం మనందరి కర్తవ్యం. ప్రజలు, పాత్రికేయులు, రాజకీయ పక్షాలు అందరూ స్పందించాల్సిన సమయమిది’’ అని బుద్ధ ప్రసాద్‌ పిలుపునిచ్చారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని