Covid Treatment: కడుపులో మంట ఔషధంతో కొవిడ్‌కు చికిత్స

తాజా వార్తలు

Updated : 22/08/2021 13:34 IST

Covid Treatment: కడుపులో మంట ఔషధంతో కొవిడ్‌కు చికిత్స

వాషింగ్టన్‌: కడుపులో మంటను తగ్గించడానికి వాడే ఒక ఔషధంతో కొవిడ్‌-19కు చికిత్స చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మహమ్మారితో తలెత్తే దుష్ప్రభావాలను తగ్గించే సామర్థ్యం దీనికి ఉందన్నారు. కొవిడ్‌ వెలుగు చూసిన తొలిరోజుల్లో చైనాలోని వుహాన్‌లో ఆశ్చర్యకరమైన పరిణామాన్ని వైద్యులు గుర్తించారు. ఆ వ్యాధిని తట్టుకొని ప్రాణాలు కాపాడుకున్న వయోధికుల్లో ఎక్కువ మంది పేదలే. సాధారణ ఆరోగ్య సంక్షోభాల్లో కనిపించే తీరుకు భిన్నంగా ఇది ఉంది. దీంతో పరిశోధకులు వారి వైద్య రికార్డులను సమీక్షించారు. వారిలో ఎక్కువ మంది దీర్ఘకాల కడుపు మంటకు చౌకైన ఫామోటిడిన్‌ అనే మందును వాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫామోటిడిన్‌ వల్ల కొవిడ్‌ బాధితులకు ఉపశమనం కలుగుతోందా అన్నది గుర్తించేందుకు వర్జీనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధన జరిపారు. వీరు 30 దేశాల్లోని 22వేల మంది కొవిడ్‌ బాధితుల వైద్య రికార్డులను పరిశీలించారు. నిర్దిష్ట మోతాదులో ఫామోటిడిన్‌ ఔషధాన్ని పొందిన కరోనా బాధితులకు ప్రాణాలు నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గుర్తించారు.

ముఖ్యంగా ఆస్ప్రిన్‌తో కలిపి దీన్ని వాడినప్పుడు ఫలితాలు మెరుగ్గా ఉంటాయని తేల్చారు. వెంటిలేటర్‌ వంటి సాధనాలను అమర్చాల్సిన స్థితికి వీరి ఆరోగ్యం క్షీణించే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధకులు చెప్పారు. ఇన్‌ఫెక్షన్‌కు ప్రతిగా శరీర రోగనిరోధక వ్యవస్థ సైటోకైన్‌ అనే ప్రొటీన్లు వెలువరిస్తుంది. అయితే కొన్నిసార్లు తీవ్ర అనారోగ్యం వల్ల వీటి ఉత్పత్తి కట్టు తప్పి ‘సైటోకైన్‌ తుపాను’ చెలరేగుతుంది. అవి ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల కణజాలాలనూ దెబ్బతీస్తాయి. ఇలాంటి చర్యను అణచివేయడం ద్వారా కొవిడ్‌ బాధితులకు ఫామోటిడిన్‌ ఉపశమనాన్ని కలిగిస్తుండొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని