పాక్‌ నుంచి పాఠాలు నేర్చుకునే స్థితిలో లేం.. ఐరాసలో దాయాది తీరు ఎండగట్టిన భారత్‌

తాజా వార్తలు

Published : 16/09/2021 02:17 IST

పాక్‌ నుంచి పాఠాలు నేర్చుకునే స్థితిలో లేం.. ఐరాసలో దాయాది తీరు ఎండగట్టిన భారత్‌

న్యూయార్క్‌: ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్‌లో దాయాది దేశం పాకిస్థాన్‌పై భారత్‌ మండిపడింది. కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తిన ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (OIC)కు చురకలంటించింది. విఫల దేశం పాక్‌ నుంచి పాఠాలు నేర్చుకునే స్థితిలో భారత్‌ లేదని ఘాటుగా స్పందించింది. ఉగ్రవాదులకు పాకిస్థాన్‌ బహిరంగంగా మద్దతు ఇస్తోందని.. వారికి ఆర్థికంగా సాయం చేస్తోందని బుధవారం జరిగిన 48వ మానవ హక్కుల కౌన్సిల్‌లో భారత్ ఆరోపించింది. ఐరాస జాబితాలో ఉన్న ఉగ్రవాదులు సహా ఇతర ముష్కరులకు అండగా నిలవడం పాక్ ప్రభుత్వ విధానంగా ఉందని విమర్శించింది.

సిక్కులు, హిందువులు, క్రైస్తవులు సహా మైనార్టీల హక్కుల పరిరక్షణలో పాక్ విఫలమైందని జెనీవాలో భారత శాశ్వత మిషన్‌ మొదటి కార్యదర్శి పవన్ బాధే పేర్కొన్నారు. ఆ దేశంలో మైనార్టీ వర్గాలకు చెందిన వేలాది మంది మహిళలు, బాలికలు అపహరణ, బలవంతపు పెళ్లిళ్లు, మత మార్పిడులకు గురవుతున్నట్లు తెలిపారు. భారత్ ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమే కాకుండా శక్తివంతమైందని గుర్తుచేశారు. విఫల దేశం పాకిస్థాన్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన స్థితిలో తాము లేమని భారత్  ఈ సందర్భంగా పేర్కొంది. ఐరాస కౌన్సిల్ అందించిన వేదికను దుర్వినియోగం చేస్తూ.. భారత్‌కు వ్యతిరేకంగా తప్పుడు, హానికరమైన ప్రచారం చేయడం ఇస్లామాబాద్‌కు అలవాటుగా మారిందని ఘాటుగా స్పందించింది.

ఐరాస కౌన్సిల్‌లో పవన్ బాధే మాట్లాడుతూ.. ‘ఆక్రమిత భూభాగాల విషయం, తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి కౌన్సిల్ దృష్టిని మరల్చేందుకు పాకిస్థాన్ చేసే ప్రయత్నాలు కౌన్సిల్‌కు తెలుసు. భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అంతేకాకుండా దృఢమైన, శక్తిమంతమైన దేశం. తీవ్రవాదానికి కేంద్రంగా.. మానవ హక్కులు అత్యంత దయనీయంగా ఉన్న విఫల పాకిస్థాన్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన స్థితిలో భారత్ లేదు’ అని పేర్కొన్నారు. పాక్‌లో మైనార్టీలపై హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయని.. వారి ప్రార్థనా మందిరాలపై దాడులు జరుగుతున్నట్లు ఆయన గుర్తుచేశారు. ఐరాస జాబితాలో ఉన్న ఉగ్రవాదులు సహా ఇతర ముష్కరులకు పాక్‌ మద్దతు ఇస్తోందని.. వారికి శిక్షణ, ఆర్థిక సాయం, ఆయుధాలు సమకూరుస్తోందని ఆరోపించారు. కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తిన ఓఐసీని పవన్ బాధే తప్పబట్టారు. ఓ దేశ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడే అర్హత ఓఐసీకి లేదని స్పష్టం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని