Supreme court: ‘టీకా కేంద్రంలో ఆధార్‌ తప్పనిసరి’పై మీ స్పందన తెలపండి

తాజా వార్తలు

Published : 01/10/2021 22:37 IST

Supreme court: ‘టీకా కేంద్రంలో ఆధార్‌ తప్పనిసరి’పై మీ స్పందన తెలపండి

కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు

దిల్లీ: కొవిడ్‌ టీకా కోసం వ్యాక్సినేషన్‌ కేంద్రంలో ఆధార్ వివరాలు తప్పనిసరిగా సమర్పించడం తొలగించాలని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రానికి, భారత ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ)కు నోటీసులు జారీ చేసింది. పుణెకు చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త సిద్ధార్థ్‌శంకర్‌ శర్మ ఈ మేరకు కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. టీకా రిజిస్ట్రేషన్‌ కోసం ‘కొవిన్‌ పోర్టల్‌’లోనూ ఆధార్‌ వివరాలు తప్పనిసరి చేయడం తగదని పిటిషనర్‌ తన వ్యాజ్యంలో పేర్కొనగా.. ‘దినపత్రికలు చదవడం లేదా! ఈ మధ్య కొవిన్‌ యాప్‌ చూశారా? యాప్‌ను అప్‌డేట్‌ చేశారు. వ్యాక్సినేషన్‌కు రిజిస్ట్రేషన్‌ కోసం ఇతర గుర్తింపు కార్డులూ అనుమతిస్తున్నారు’ అని పేర్కొంది. అయితే ‘కొవిన్‌లో పేర్కొన్న ఏడు రకాల గుర్తింపు కార్డులు లేకున్నా.. టీకాలు వేయాలని కుటుంబ ఆరోగ్య మంత్రిత్వశాఖ నిర్దేశిస్తోంది. కానీ, చివరకు వచ్చేసరికి ఆధార్‌ వివరాలు తీసుకుంటోంది. ఇది పూర్తి విరుద్ధ చర్య. కేంద్రం అసలు లక్ష్యాలపై ఇది సందేహాలు సృష్టిస్తోంది. ఆధార్ కార్డునే ఏకైక గుర్తింపు పత్రంగా పరిగణించొద్ద’న్న పిటిషనర్‌ వాదనలు విన్న ధర్మాసనం.. దీనిపై స్పందన కోరుతూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని