చదువే విద్యార్థుల వద్దకొచ్చింది.. ఇలా!

తాజా వార్తలు

Published : 26/06/2020 15:00 IST

చదువే విద్యార్థుల వద్దకొచ్చింది.. ఇలా!

కరోనా కాలంలో ఉపాధ్యాయుడి సమయస్ఫూర్తి

దుమ్‌కా: దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో పాఠశాలలు మార్చి నెల నుంచి మూతపడ్డాయి. అయితే ఝూర్ఖండ్‌లోని దుమ్‌కా జిల్లాలోని బంకాథీ అనే మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థులు... తమ ప్రధానోపాధ్యాయుడి చొరవ వల్ల స్మార్ట్‌ ఫోన్లు లేకపోయినా చదువు కొనసాగించారు. మరి లాక్‌డౌన్‌ కాలంలో ఇదెలా సాధ్యమైందంటే...

బంకాథీలోని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్‌ 16 నుంచి రోజుకు రెండు గంటల పాటు తరగతులు జరుగుతున్నాయి. ఆన్‌లైన్‌ తరగతులు చూసేందుకు వారిలో చాలా మంది వద్ద స్మార్ట్‌ఫోన్లు లేనే లేవు. ఆ విద్యార్థులు తమ తమ ఇళ్లలోనే ఉండి విద్యనభ్యసిస్తున్నారు. రోజూ ఉదయం పది గంటలకల్లా తరగతులు ప్రారంభమవుతాయి. ఐదుగురు టీచర్లు, ఇద్దరు సహాయకులు పాఠశాలలో ఉన్న మైక్‌ ద్వారా పాఠాలు చెబుతున్నారు. విద్యార్థులు అధికంగా ఉన్న చోట్ల మరింత చక్కగా వినిపించేందుకు లౌడ్‌ స్పీకర్లను ఏర్పాటుచేశారు.

విద్యార్థుల సందేహాలు తీరేదెలా?

‘‘246 మంది విద్యార్థులలో 204 మంది దగ్గర స్మార్ట్‌ ఫోన్లు లేనేలేవు. అందుకే మేము ఈ విధానాన్ని అనుసరిస్తున్నాము. విద్యార్థుల్లో ఎవరికైనా సందేహాలు వచ్చినప్పుడు లేదా ఏదైనా ప్రశ్న వేయాలనుకున్నపుడు వారు ఎవరి మొబైల్‌ ఫోన్‌ ద్వారా అయినా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఆయా సందేహాలను మేము మరుసటి రోజు వివరిస్తాం.’’ అని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్యామ్‌ కిశోర్‌ సింగ్‌ గాంధీ తెలియజేశారు. ఈ కొత్త విధానానికి విద్యార్థులు చక్కగా స్పందిస్తున్నారని... పాఠాలను అర్థం చేసుకుంటున్నారని తల్లితండ్రులు, గ్రామ పెద్దలు కితాబిస్తున్నారు. తమకు ఈ విధానం బాగా నచ్చిందని విద్యార్థులు అంటున్నారు.

ప్రధానోపాధ్యాయుడు శ్యామ్‌ కిశోర్‌ ఆలోచనకు, ఆచరణకు దుమ్‌కా జిల్లా విద్యాశాఖాధికారుల ప్రశంశలు లభించాయి. లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు వేచిచూడకుండా, సిలబస్‌ను పూర్తి చేసేందుకు జిల్లాలోని అన్ని పాఠశాలలు ఈ విధానాన్ని అనుసరించాలని వారు అంటున్నారు. తమ వద్ద తగిన సదుపాయాలు లేక ఆన్‌లైన్‌ తరగతులను వినలేని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఈ పరిస్థితుల్లో .. ‘‘ఉపాధ్యాయులు తల్చుకుంటే ప్రపంచాన్నే మార్చేయగలరు.’’ అనే తన నమ్మకాన్ని ఆచరించి చూపించిన ఈ ఉపాధ్యాయుడి కృషి పలువురి మన్ననలందుకుంటోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని