అర్హుల్లో కొందరికే అనుమతి
eenadu telugu news
Published : 25/10/2021 05:51 IST

అర్హుల్లో కొందరికే అనుమతి

పదోన్నతుల ఉత్తర్వులపై ఉపాధ్యాయుల్లో ఆందోళన
మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

ప్రధానోపాధ్యాయుల ధ్రువపత్రాలు పరిశీలిస్తున్న డీఈవో కార్యాలయ ఉద్యోగులు

ఏడాది కాలంగా ఎంతోమంది ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల ఉద్యోగోన్నతుల కోసం ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు కౌన్సెలింగ్‌ సమయం ఆసన్నంకావడంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నా జిల్లా విద్యాశాఖ రూపొందించిన నివేదిక ప్రకారం పూర్తిస్థాయిలో పదోన్నతులు కల్పిస్తారా...లేక తగ్గిస్తారా అన్న విషయం తెలియక ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. వారు అనుమానిస్తున్నట్లుగానే కొంతమందిని మినహాయించి ఉత్తర్వులు జారీ కావడం ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జిల్లా విద్యాశాఖ మాత్రం ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం ప్రక్రియ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది.

స్కూల్‌ అసిస్టెంట్ల పోస్టులకు సైతం..
జిల్లా పరిషత్‌ పాఠశాలలకు చెందిన 55 మంది ఉపాధ్యాయులు, ప్రభుత్వ బడులకు చెందిన ఆరుగురు కలిసి మొత్తం 61మంది ప్రధానోపాధ్యాయులు పదోన్నతులకు అర్హులుగా గుర్తించి నివేదిక తయారు చేసింది. ఈ నివేదికను ఆర్‌జేడీకి పంపించారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఆరుగురికి ఆర్జేడీ కార్యాలయంలో కౌన్సెలింగ్‌  జరుగుతుంది. జిల్లాపరిషత్‌ ఉపాధ్యాయులకు సోమవారం నిర్వహించి, పోస్టులు కేటాయించాల్సి ఉంది. దీంతో ఆదిశగా అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్‌జేడీ  కార్యాలయం నుంచి 55మందిలో 40మందికి మాత్రమే పదోన్నతులు కల్పించాలంటూ ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు రావడంతో ఉపాధ్యాయుల్లో  ఆందోళన నెలకొంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 40మందికి మొదట పదోన్నతులు కల్పించి మిగిలిన వారికి తరువాత కౌన్సెలింగ్‌ నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే పదోన్నతులు పొందనున్న ఉపాధ్యాయులు అందరి ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తిచేశారు.  ప్రధానోపాధ్యాయుల ప్రక్రియ పూర్తయిన తరువాత ఈనెల  29, 30 తేదీల్లో స్కూల్‌    అసిస్టెంట్‌లకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పోస్టులు 207 ఉన్నాయి. వీటిలో ఎన్ని తగ్గిస్తారోనని ఉపాధ్యాయులు  చర్చించుకుంటున్నారు.

సంఘాల సూచనలు పరిశీలిస్తారా..!
పదోన్నతులపై జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాలతో అధికారులు సమావేశం నిర్వహించగా వారు పలు సూచనలు  చేశారు. పదోన్నతుల్లో  ఒక పోస్టుకు ఒకరినే పిలవడం వల్ల వారు వద్దనుకుంటే అది ఖాళీగా ఉండిపోతుందని, ఇలా  ఖాళీలు మిగలకుండా సీనియారిటీ జాబితాలో వారి వెనుకస్థానంలో ఉన్నవారికి అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతోపాటు కొంతమంది ఉపాధ్యాయులు పదోన్నతి దూర ప్రాంతం వస్తే వెళ్లకుండా దగ్గరి ప్రాంతం వచ్చేవరకు ఆగి తరువాత మళ్లీ జాబితాలో పేరు నమోదు చేయించుకుంటున్నారని ఇలాంటివారిపై కూడా ప్రత్యేక దృష్టిసారించాలని చెప్పారు. ఖాళీలను బ్లాక్‌చేయకుండా అన్నింటినీ ప్రదర్శించాలని ఉపాధ్యాయుల సర్వీసు రిజిస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించాలని ఇలా వివిధ అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి  పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.వాటిలో కొన్ని అంశాలను కమిషనరేట్‌కు చెప్పి పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. వాటిలో ఎన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటారో చూడాలి.


వెబ్‌సైట్‌లో వివరాలు

ప్రభుత్వం నుంచి 40మందికి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు రావడంతో ఆదిశగా ఏర్పాట్లు చేస్తున్నాం.వారి వివరాలు విద్యాశాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచాం. అందరూ పరిశీలించుకోవచ్చు. అర్హులందరూ సర్వీసు రిజిస్టర్లు, ధ్రువపత్రాలు తీసుకుని సోమవారం మధ్యాహ్నం 2.30కు మచిలీపట్నంలోని జిల్లావిద్యాశాఖ కార్యాలయంలో ప్రారంభమయ్యే కౌన్సెలింగ్‌కు విధిగా హాజరు కావాలి.

- తాహెరా సుల్తానా, జిల్లా విద్యాశాఖాధికారిణి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని