ఆర్చర్లకు 15 రోజుల శిక్షణ
eenadu telugu news
Published : 25/10/2021 05:51 IST

ఆర్చర్లకు 15 రోజుల శిక్షణ


లెనిన్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న మంగళ్‌సింగ్‌ ఛాంపియా, డాలీ శివాని తదితరులు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: ప్రతి నెల 15 రోజుల పాటు చెరుకూరి లెనిన్‌ ఓల్గా ఆర్చరీ అకాడమీలో ఆర్చర్లకు శిక్షణనిస్తానని అకాడమీలో శిక్షణ పొందిన ఒలింపియన్‌, అర్జున అవార్డీ మంగళ్‌సింగ్‌ ఛాంపియా అన్నారు. గుణదల విజయలక్ష్మీ కాలనీలోని వీఎంసీ ఓల్గా ఆర్చరీ మైదానంలో ఆదివారం జిల్లా ఆర్చరీ సంఘం, చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన 11వ వర్ధంతి కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా అకాడమీ ప్రాంగణంలోని అంతర్జాతీయ ఆర్చర్‌, జాతీయ ఆర్చరీ జట్టు శిక్షకుడు చెరుకూరి లెనిన్‌ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతర్జాతీయ ఆర్చర్లు డాక్టర్‌ మండవ రిషిత, బొమ్మదేవర ధీరజ్‌, పూర్వషా సుధీర్‌ షిండే, కుందేరు వెంకటాద్రి, కిడ్‌ ఆర్చర్‌ చెరుకూరి డాలీ శివాని, అకాడమీ కార్యదర్శి, కృష్ణా జిల్లా ఆర్చరీ సంఘం కోశాధికారి గొట్టిపాటి ప్రేమ్‌కుమార్‌, ఉపాధ్యక్షుడు మండవ కోటేశ్వరరావు, రాజ్యలక్ష్మి, సునీత, జాతీయ ఆర్చరీ సంఘం సాంకేతికాధికారులు బి.శ్రావణ్‌కుమార్‌, బీవీ రమణ, ప్రముఖ న్యాయవాది పి.రాజశేఖర్‌, అకాడమీలో శిక్షణ పొంది రైల్వే, ఆర్మీ, ఇన్‌కమ్‌ట్యాక్స్‌, బ్యాంక్‌, రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ, ఆర్చరీ కోటాలో వైద్య సీట్లు పొంది వైద్యులుగా పనిచేస్తున్నవారు, ఇంజినీర్లు, పలువురు ప్రముఖులు లెనిన్‌ విగ్రహం వద్ద పుష్పాలు సమర్పించి ఘన నివాళులర్పించారు. సభకు అధ్యక్షత వహించిన లెనిన్‌ తండ్రి, అకాడమీ చీఫ్‌ కోచ్‌ చెరుకూరి సత్యనారాయణ, లెనిన్‌ తల్లి కృష్ణకుమారిలు మాట్లాడుతూ భవిష్యత్తులో లెనిన్‌ లక్ష్యాన్ని నెరవేర్చడానికి అకాడమీకి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అకాడమీ శిక్షకులు నవీన్‌కుమార్‌, ఎం.నీలిమ, ఎస్‌కే తపన్‌, కార్యాలయ కార్యదర్శి బి.రాజ, ఎస్‌.రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని