నేరాల కొత్త రూపు
eenadu telugu news
Updated : 25/10/2021 11:25 IST

నేరాల కొత్త రూపు

మిస్సింగులు.. పోక్సో కేసులు..!
అర్బన్‌, రూరల్‌లో అత్యధికం ఇవే
ఈనాడు, అమరావతి

గుంటూరు అర్బన్‌ జిల్లా పోలీసుల పరిధిలో సగటున ప్రతి పోలీస్‌స్టేషన్‌లో బాలికల అదృశ్యాలు, లైంగిక దాడులు, గంజాయి, సైబర్‌ మోసాల కేసులు అనునిత్యం నమోదవుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో వీటి సంఖ్య బాగా పెరిగింది. గ్రామీణ పోలీసుల పరిధిలో సత్తెనపల్లి, తెనాలి సబ్‌ డివిజన్లలోనూ ఈ తరహా కేసులు వస్తున్నాయి. దశాబ్దకాలం క్రితం హత్యలు, హత్యా యత్నాలు, చోరీలు, కొట్లాట కేసులే ఎక్కువగా ఉండేవని వార్షిక నేర రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆ కేసులు తగ్గిపోయి అదృశ్యాలు, లైంగిక దాడులకు సంబంధించిన పోక్సో, గంజాయి తదితర మాదక ద్రవ్యాల కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

గతంలో నగరంలో రౌడీల హత్యలు, ఆగడాలతో అట్టుడికిపోయేది. ఆపై కాల్‌మనీ వ్యాపారం కేసులతో దద్దరిల్లేది. దీంతో గుంటూరు ను అర్బన్‌, రూరల్‌ జిల్లాలుగా విభజించారు. పోలీసు అధికారుల పర్యవేక్షణ పెరిగి నేరాలు తగ్గుతాయని, శాంతిభద్రతలు మెరుగవుతాయని భావించారు. అందుకు విరుద్ధంగా అర్బన్‌లో నానాటికి నేరాలు సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి.

హెచ్‌ఆర్‌ఏ ప్రభావం..
ఇంటిభత్యం అలవెన్సు గుంటూరు అర్బన్‌ జిల్లాలో రెండు రకాలుగా ఉంది. మంగళగిరి, తాడేపల్లి, చేబ్రోలు సర్కిళ్ల పరిధిలో 14 శాతం కాగా మిగిలిన సర్కిళ్లలో 20 శాతం ఉంది. దీంతో అధిక హెచ్‌ఆర్‌ఏ పొందవచ్చని చాలా వరకు కానిస్టేబుళ్లు, హెచ్‌సీలు, ఇతర మహిళా పోలీసు సిబ్బంది గుంటూరు నగరంలోని అరండల్‌పేట, పట్టాభిపురం, నగరంపాలెం, కొత్తపేట, లాలాపేట, పాతగుంటూరు, పెదకాకాని, మేడికొండూరు, నల్లపాడు సర్కిళ్లలో పని చేయడానికే ఆసక్తి చూపుతారు. పర్యవసానంగా మంగళగిరి, తాడేపల్లి, చేబ్రోలు సర్కిళ్లల్లోని స్టేషన్లలో ఖాళీలు ఉన్నాయని ఓ అధికారి వివరించారు. ఈ వ్యత్యాసాన్ని సరి చేసి అర్బన్‌లో ఎటుచూసినా 20-25 కి.మీ పరిధే కావడంతో ఇంటి భత్యాన్ని ఒకేరకంగా చెల్లించేలా మార్పు చేస్తే అన్ని స్టేషన్లకు సిబ్బంది పెరుగుతారు. నేరాల కట్టడికి పర్యవేక్షణ పెరుగుతుంది.


4 సబ్‌ డివిజన్లు

గుంటూరు తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తర వలయం డివిజన్లుగా అర్బన్‌ జిల్లా ఏర్పాటైంది. ఈ నాలుగు సబ్‌ డివిజన్లలో కలిపి 17 పీఎస్‌లు ఉన్నాయి. వీటి పరిధిలో మిస్సింగ్‌, పోక్సో కేసులతో పాటు వివిధ రకాలైన మోసాలు, సైబర్‌ నేరాల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, వాటి కట్టడికి చర్యలు తీసుకోవాలని నెలవారీ జరిగే నేర సమీక్షలో అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ సీఐలు, డీఎస్పీలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. అయినా ఈ కేసులు తగ్గకపోగా రోజురోజుకు పెరగుతూ అధికారులకు సవాలు విసురుతున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోలీసు సర్కిళ్లు, సిబ్బంది పెరగలేదు. దీంతో పర్యవేక్షణ తగ్గి నేరాలు పెరగడానికి కారణమవుతున్నాయని సీనియర్‌ పోలీసు అధికారులు అంటున్నారు. ఇంతకుముందే నల్లపాడు సర్కిల్‌ను రెండుగా విడగొట్టి గోరంట్ల పేరుతో ఓ సర్కిల్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. కొత్తపేట, పాత గుంటూరు సర్కిళ్ల నుంచి కొన్ని ప్రాంతాలను తప్పించి మూడు, నాలుగు సర్కిళ్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచన కార్యరూపం దాల్చలేదు. ఎక్కడికక్కడ సిబ్బందిని పెంచుకుని, సీసీ కెమెరాల వ్యవస్థ 24 గంటల పాటు పనిచేసేలా ఏర్పాట్లు చేసకుని ముందుకెళ్తే తప్ప అర్బన్‌లో నానాటికి పెరుగుతున్న నేరాలు కట్టడికావని అధికారులు చెబుతున్నారు.


కేసులు ఇలా...

* నెహ్రూనగర్‌కు చెందిన ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు కలిసి ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారని కొత్తపేటలో మిస్సింగ్‌ కేసు నమోదైంది. ఆ పిల్లలు చెన్నై వెళ్లి తిరిగొస్తుండగా నెల్లూరులో వారిని పట్టుకోవడంతో పిల్లల తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

* లాలాపేట పరిధిలో ఒకే రోజు ముగ్గురు అమ్మాయిలు తప్పిపోవడం సంచలనమైంది. వారు ముగ్గురు అదే రోజు తెల్లవారుజామున కావటి శంకరరావు మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో ఉండగా పోలీసులు పట్టుకున్నారు.

* పాతగుంటూరులో వారం క్రితం ఇద్దరు బాలికలను మాయమాటలు చెప్పి ఓ యువకుడు తీసుకెళ్లగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.మార్కెట్‌ సెంటర్‌లో నెల క్రితం ఓ అరటికాయల వ్యాపారి బ్యాంకు షట్టర్లు పగులగొట్టి రూ.15 లక్షలు పట్టుకెళ్లగా సీసీ ఫుటేజీల ఆధారంగా గుర్తించారు.

* మార్కెట్‌ సెంటర్‌ వద్ద ఓ ఉద్యోగి నుంచి ఖాతా, పిన్‌ వివరాలు తీసుకుని యువకులు రూ.లక్ష కొల్లగొట్టారు.

* పెదకూరపాడు స్టేషన్‌లో గతనెల 10న పెదకూరపాడు గ్రామానికి చెందిన బాలిక అదృశ్యమైనట్లు కేసు నమోదైంది. ఇప్పటికీ పురోగతి లేదు.

* పెదకూరపాడు స్టేషన్‌లో ఈ నెల 11న ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు 75 త్యాళ్లూరు గ్రామానికి చెందిన వివాహితుడిపై పోక్సో కేసు నమోదైంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని