పోలీసుల అదుపులో వైకాపా నేతలు
eenadu telugu news
Published : 25/10/2021 05:27 IST

పోలీసుల అదుపులో వైకాపా నేతలు

స్టేషన్‌ ఎదుట పార్టీ కార్యకర్తల ఆందోళన

పురపాలక కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న కార్యకర్తలు

నరసరావుపేట పట్టణం, న్యూస్‌టుడే: నరసరావుపేట పట్టణంలోని మూడు, ఆరో వార్డులకు చెందిన వైకాపా ఇన్‌ఛార్జిలు సిలార్‌, జాఫర్‌, ఆరో వార్డు వాలంటీర్లు రవిచంద్ర, నాని తన విధులకు ఆటంకం కలిగించి, కులం పేరుతో దూషించారని వార్డు సచివాలయ ఉద్యోగిని నవ్య హిమబిందు శనివారం రాత్రి రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో స్టేషన్‌ సిబ్బంది నలుగురిని ఆదివారం వేకువజామున అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆదివారం పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నా చేశారు. అధికార పార్టీకి చెందిన వారిని అరెస్టు చేస్తారా.. అని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారిని వెంటనే వదిలేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు నిరాకరించడంతో వార్డు సచివాలయ అడ్మిన్‌, మున్సిపల్‌ కమిషనర్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కమిషనర్‌ అండచూసుకుని వాలంటీర్లు, పార్టీ ఇన్‌ఛార్జిలపై సచివాలయ అడ్మిన్‌ ఫిర్యాదు చేశారని ఆరోపించారు. మూడు గంటలపాటు స్టేషన్‌ ఎదుట హైడ్రామా చోటుచేసుకుంది. పార్టీ నేతలు కొందరు స్టేషన్‌ వద్దకు వచ్చి పోలీసులతో మాట్లాడి ఆందోళన చేస్తున్న వారిని ఎమ్మెల్యే వద్దకు తీసుకెళ్లారు. ఆయన కమిషనర్‌తో మాట్లాడి అడ్మిన్‌ను వార్డు నుంచి బదిలీ చేయిస్తానని హామీ ఇవ్వడంతో పార్టీ శ్రేణులు శాంతించాయి. అడ్మిన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారించేందుకు నలుగురిని అదుపులోకి తీసుకున్నామని సీఐ వెంకట్రావు తెలిపారు. అడ్మిన్‌పై వాలంటీరు నాని ఫిర్యాదు చేశారన్నారు. అనంతరం అడ్మిన్‌, నాని ఫిర్యాదులు వెనక్కి తీసుకున్నారని సీఐ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని