జీజీహెచ్‌లో జీర్ణ సమస్యలకుఅత్యాధునిక వైద్యం
eenadu telugu news
Published : 25/10/2021 05:27 IST

జీజీహెచ్‌లో జీర్ణ సమస్యలకుఅత్యాధునిక వైద్యం

అందుబాటులోకి రూ.3 కోట్ల పరికరాలు
గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే

రోగిని పరీక్షిస్తున్న ఆచార్య కవిత, నాగూర్‌బాషా

ఒకప్పుడు ఎంతకీ అంతుబట్టని చాలా జీర్ణ సమస్యలను ఇప్పుడు క్షణాల్లో నూరుశాతం కచ్చితత్వంతో సర్వజనాసుపత్రిలో నిర్ధారించగలుగుతున్నారు. ఎంతో ముదిరితేనే గానీ పట్టుకోలేని చాలా జబ్బులను ఇప్పుడు తొలి దశలోనే.. సూక్ష్మంలోనే తేల్చేస్తున్నారు. పొట్ట మొత్తం తెరిచి పెద్దపెద్ద ఆపరేషన్లు చేస్తేగానీ పూర్తవ్వని చాలా చికిత్సలను ఇప్పుడు కేవలం కెమెరా గొట్టంతోనే పూర్తి చేస్తున్నారు. ఇందుకోసం వీడియో ఎండోస్కోపీ, ఈఆర్‌సీపీ స్కోప్‌ వంటి సరికొత్త వైద్య పరికరాలను ఇటీవలే రూ.3 కోట్ల వ్యయంతో కొనుగోలు చేశారు. గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం అధిపతి ఆచార్య కవిత, సహాయ ఆచార్యులు నాగూర్‌బాషా రోగులకు చికిత్స అందిస్తున్నారు.

రోగులు ఏమి చేయాలి? రోగులు మంగళ, గురు, శనివారాల్లో పొరుగు రోగుల విభాగంలో పేరు నమోదు చేసుకుని 15వ నెంబరు గదికి రావాలి. వైద్యులు పరీక్షించిన అనంతరం అవసరమైతే పొదిల ప్రసాద్‌ భవనంలోని రెండో అంతస్తులోని వార్డు(220)లో చేర్చుకుని చికిత్స అందిస్తారు. ఆరోగ్యశ్రీ, ఆధార్‌ కార్డులున్నవారు తప్పకుండా తీసుకురావాలి. అత్యవసర చికిత్స అవసరమైనవారు ఎప్పుడైనా అత్యవసర విభాగంలో చేరవచ్చు.

గుర్తించి.. చికిత్స: అన్నవాహిక క్యాన్సర్‌, జీర్ణాశయ క్యాన్సర్లు తొలి దశలో ఉంటే.. ఆ మార్పులు వస్తున్న పైపొరలను అప్పటికప్పుడు తొలగించి.. పూర్తిగా నయం చెయ్యడం, ప్రాణాలను కాపాడడం కూడా సాధ్యపడుతుంది. ఇవేకాదు ఇంతకుముందు పెద్ద ఆపరేషన్లు అవసరమయ్యే పెద్దపేగులో పిలకలు, పిత్తాశయ నాళంలో రాళ్లు, పేగుల్లో అవరోధాలు వంటి చాలా సమస్యలను ఇప్పుడు తేలికగా నయం చేసే వీలుంది.

ఎలాంటి సమస్యలకు వైద్యం? హెపటైటిస్‌ బి, సి, అజీర్ణ వేదన, పొట్టలో నొప్పి, ఛాతీలో మంట, ముద్ద దిగకపోవటం, మలబద్ధకం, కడుపు ఉబ్బరం, నొప్పి, సిరోసిస్‌, అమీబియాసిస్‌, పేగులో తిత్తులు, పేగుల్లో పూత, పేగుల్లో రక్తస్రావం, పేగుల్లో పుండు, కణితి, పేగుల్లో క్షయ, కాలేయంలో రాళ్లు, కణుతులు, రక్తపు వాంతులు, దీర్ఘకాలిక విరేచనాలు, అసిడిటీ, పిల్లలు బ్యాటరీలు, గుండు సూదులు మింగినప్పుడు, క్లోమం, పసరతిత్తి సమస్యల నిర్ధారణకు తదితర ఆరోగ్య సమస్యలకు చికిత్స అందిస్తారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని