పీహెచ్‌సీలకు నూతన కమిటీలు
eenadu telugu news
Published : 25/10/2021 05:27 IST

పీహెచ్‌సీలకు నూతన కమిటీలు

న్యూస్‌టుడే, సత్తెనపల్లి


అత్తలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్‌సీ) కొత్త అభివృద్ధి కమిటీలు కొలువు తీరబోతున్నాయి. పరిషత్‌, పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తవ్వడంతో కమిటీల ఏర్పాటుకు మార్గం సుగుమమైంది. గత ప్రభుత్వ హయంలో సామాజిక సేవకులు, డ్వాక్రా మహిళలు, అధికారులతో ఆసుపత్రి అభివృద్ధి కమిటీలు ఏర్పాటయ్యాయి. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తరువాత కమిటీల్లో మార్పులు చేసి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు వాటిలో అగ్ర ప్రాధాన్యమిచ్చారు. 2019 మార్చితో పాత కమిటీల పదవీకాలం ముగిసింది. స్థానిక ఎన్నికల జాప్యంతో ఇప్పటివరకు నూతన కమిటీలు ఏర్పాటవ్వలేదు. మున్సిపల్‌ ఎన్నికల తరువాత జిల్లా, ప్రాంతీయ, సామాజిక ఆసుపత్రుల్లో కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యింది. తాజాగా పీహెచ్‌సీల్లో వాటిని ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 87 పీహెచ్‌సీలు ఉండగా నూతక్కి, పెదవడ్లమూడి పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలోకి వెళ్లాయి. మిగిలిన 85 పీహెచ్‌సీల్లో ఆసుపత్రి అభివృద్ధి సొసైటీలను రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. ఈ నెలాఖరులోపు కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసేందుకు వైద్యులు కసరత్తు చేస్తున్నారు.

* వైద్యఆరోగ్యశాఖ కమిషన్‌ మార్గదర్శకాల మేరకు పీహెచ్‌సీ అభివృద్ధి సొసైటీకి ఎంపీపీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. సీనియర్‌ మెడికల్‌ అధికారి మెంబర్‌ కన్వీనర్‌గా ఉంటారు. ఎంపీడీవో, తహసీల్దార్‌, పీహెచ్‌డీ హెడ్‌క్వార్టర్‌ గ్రామ సర్పంచి, ఎంపీపీ నామినేట్‌ చేసే మహిళా సర్పంచి సభ్యులుగా ఉంటారు.

* రెండు నెలలకు ఒకసారి విధిగా కమిటీ సమావేశమవ్వాలి. జనవరి, మార్చి, మే, జులై, సెప్టెంబరు, నవంబరులో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచనలు చేశారు. రెండో వారంలో సమావేశం ఏర్పాటుకు మొదటి వారంలోనే నోటీసులు ఇవ్వాలని సూచించారు.

* సమావేశానికి హాజరైన వారి వివరాలు, మినిట్స్‌, ఆదాయ.. వ్యయ వివరాల్ని ప్రతి సమావేశం తరువాత ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని సూచనలు చేశారు.

* పీహెచ్‌సీలకు ఇప్పటివరకు అభివృద్ధి కమిటీలు లేకపోవడంతో ఆసుపత్రి వైద్యుడు, ఎంపీడీవో సంయుక్తంగా నిధులు ఖర్చు చేస్తున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఏడాది వరకు ఆసుపత్రుల్లో నిధులు సమృద్ధిగా ఉన్నా వాటిని పూర్తి స్థాయిలో వినియోగించలేదు. కొత్త కమిటీలు ఆస్పత్రుల్లో ఖర్చవ్వకుండా ఉన్న నిధుల్ని మౌలిక వసతులు.. రోగులకు మెరుగైన సదుపాయాలకు వినియోగిస్తే గ్రామీణులకు ఎంతో మేలు జరిగే అవకాశముంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని