కొవిడ్‌పై పోరుకు మత్తు వైద్యుల అండ
eenadu telugu news
Published : 25/10/2021 05:27 IST

కొవిడ్‌పై పోరుకు మత్తు వైద్యుల అండ

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: కొవిడ్‌-19 పోరులో మత్తు వైద్యులు ఎంతో అండగా నిలిచారని పలువురు నిపుణులు తెలిపారు. మత్తు వైద్యుల సంఘం గుంటూరు శాఖ ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని ఓ హోటల్‌లో రెండోరోజు ఆదివారం రాష్ట్ర స్థాయి వైద్య విద్య కార్యక్రమం వర్చువల్‌ విధానంలో జరిగింది. ఈ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నిపుణులైన వైద్యులు మాట్లాడుతూ కొవిడ్‌ ఒక్క ఊపిరితిత్తులపైనే కాదు, అన్ని అవయవాలపైనా ప్రభావం చూపిందన్నారు. ఇలా పలు ఇబ్బందుల్లో ఉన్న రోగులను పరీక్షించి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడంలో మత్తు వైద్యులు ఎంతో కీలకంగా వ్యవహరించారన్నారు. జబ్బు తీవ్రమై ఆక్సిజన్‌ అవసరమైన వారికి, వెంటిలేటర్‌ అమర్చిన వారికి నిరంతరం మత్తు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించి వారు కోలుకునే విధంగా చూశారన్నారు. కార్యక్రమంలో నిర్వాహక అధ్యక్షులు మోహన్‌భాస్కర్‌, ఎం.వి.భీమేశ్వర్‌, కార్యదర్శి ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం మత్తు వైద్యుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడిగా ఆర్‌ఎన్‌ఎల్‌ఎస్‌ ప్రసాద్‌(రాజమండ్రి), ఉపాధ్యక్షురాలిగా ప్రశాంతి(గుంటూరు) ఆదివారం నూతన బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌గా పి.సరోజ్‌(శ్రీకాకుళం), కార్యదర్శిగా అచ్యుతరామయ్య(కాకినాడ), కోశాధికారిగా శ్రీనివాసరావు(అమలాపురం)లను ఎన్నుకున్నారు. ఉత్తమ పరిశోధనాపత్రానికి ప్రవళిక, ఉత్తమ పోస్టర్‌కు రాఘసుజన, కృపాశ్రావ్య అవార్డులకు ఎంపికయ్యారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని