కలుషితం.. కల్లోలం
eenadu telugu news
Published : 25/10/2021 05:27 IST

కలుషితం.. కల్లోలం

కృష్ణా నదిలోకి యథేచ్ఛగా మురుగు

 ఈనాడు, అమరావతి

విజయవాడ నగరంలో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమవుతున్నాయి. ఇటీవల విజయవాడ నగర శివారులోని ఎనికేపాడు కె.వి.ఆర్‌.కాలనీలో కలుషిత నీటిని తాగడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఒక మహిళ చనిపోయింది. డయేరియాను పోలిన లక్షణాలతో చాలా మంది బాధపడుతున్నారు. విజయవాడ, శివారు ప్రాంతాల్లో జల కాలుష్యం తీవ్రతకు ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఇళ్లకు నీటిని అందించే పైప్‌లైన్‌లోనూ ప్రమాదకరమైన క్లెబ్సియెల్లా బ్యాక్టీరియా ఉన్నట్టు గుర్తించారు. వాటర్‌ ప్లాంట్‌కు చెందిన నీటి నమూనాలు కూడా కలుషితమైనట్లు గుర్తించారు. 

విజయవాడలో సరైన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు, రసాయన వ్యర్థాలు భూమిలోకే వెళ్లిపోతున్నాయి. ఆటోనగర్‌ సహా పారిశ్రామిక ప్రాంతాల్లో వెలువడే రసాయన వ్యర్థాలను యథేచ్ఛగా కాలువలు, భూమిలోకి వదిలేస్తున్నారు. విజయవాడ మీదుగా వెళ్లే మూడు ప్రధాన కాలువలు వ్యర్థాలతో నిండి ఉన్నాయి. వీటికితోడు నగరం వెలుపలి నుంచి వెళ్లి బుడమేరు కాలువ అన్ని రకాల వ్యర్థాలతో నిండిపోయింది. విజయవాడలోకి ప్రవేశించడానికి ముందే.. వ్యవసాయం కోసం వినియోగించే రసాయన వ్యర్థాలు బుడమేరులో కలుస్తున్నాయి. ఆ తర్వాత మురుగు, చెత్త, నీటి ప్లాంట్ల నుంచి విడుదలయ్యే గాఢమైన నీరు, మాంస వ్యర్థాలను విచ్చలవిడిగా కలిపేస్తున్నారు. నగరంలోని హాస్టళ్లు, ఆసుపత్రుల నుంచి కూడా చాలా చోట్ల పైప్‌లైన్లను ఈ కాలువల్లోకే యథేచ్ఛగా వదిలేస్తున్నారు.

సీజీడబ్ల్యూబీ హెచ్చరిక..
కలుషిత నీటిని తాగితే వెంటనే అనారోగ్య సమస్యల బారినపడే అవకాశం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. విజయవాడలో కలుషితంగా మారిపోయిన భూగర్భ జలాలనే తోడి తీసి.. శుద్ధి చేసి.. నీటి ప్లాంట్ల ద్వారా విక్రయిస్తున్నారు. వేల సంఖ్యలో కుప్పలుతెప్పలుగా ప్లాంట్లు వెలిశాయి. వీటిపై పర్యవేక్షణ లేదు. వీరు శుద్ధి చేసిన తర్వాత వచ్చే ఘాడ నీటిని తిరిగి భూమిలోకి పంపించేస్తున్నారు. ఇది మరింత ప్రమాదకరంగా మారుతోంది. సదరన్‌ రీజియన్‌ ఆఫ్‌ సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ బోర్డు(సీజీడబ్ల్యూబీ) విజయవాడ నగర భూగర్భ జలాల కలుషితంపై చాలాకాలం కిందటే హెచ్చరించింది. విజయవాడలోని చాలా ప్రాంతాల్లో నీటి నమూనాలను పరిశీలించిన తర్వాత తాగునీటిలో టీడీఎస్‌ శాతం అధికంగా ఉందని సీజీడబ్ల్యూబీ తెలియజేసింది. పలు రకాల రసాయనాలు, వ్యర్థాలు, బ్యాక్టీరియాలు కలిసి ఉన్నాయని పేర్కొంది. తాజాగా కె.వి.ఆర్‌.కాలనీ ఘటనలో ఇదే మరోసారి తేలింది. ఇప్పటికైనా విజయవాడ నగరం, శివారులో తాగునీటి ప్లాంట్లు, పైప్‌లైన్ల ద్వారా సరఫరా అయ్యే కలుషిత జలాలపై అధికారులు తీవ్రంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.


కాల్వలోకి వదులుతున్న మురుగు

దిలో విచ్చలవిడిగా అన్ని రకాల వ్యర్థాలు కలిపేస్తున్నారు. అందుకే ఈకోలి సహా పలు రకాల బ్యాక్టీరియాలు కృష్ణా జలాల్లోనూ పెరిగిపోతున్నాయి. విజయవాడ వన్‌టౌన్‌ ప్రాంతంలో ఇళ్ల నుంచి వచ్చే కాలువల్లో చాలావరకూ కృష్ణా కాలువల్లోకే కలిపేస్తున్నారు. విజయవాడ నగరంలో రోజు 50ఎంజీడీ నీటిని సరఫరా చేస్తుండగా.. దీనిలో 20ఎంజీడీ మురుగుగా మారుతోంది. ఈ మురుగులో సగం కృష్ణా నది, కాలువల్లోకి వదిలేస్తున్నారు. విజయవాడ స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌(స్పా) విద్యార్థులు కృష్ణా నది కాలుష్యంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి అనేక ఆసక్తికరమైన విషయాలను గుర్తించారు. కృష్ణా నదిలో పారబోస్తున్న ఘన వ్యర్థాలతో భవిష్యత్తులో అనేక ఇబ్బందులు తప్పవని అమరావతి వాకర్స్‌ అండ్‌ రన్నర్స్‌ సంస్థ అధ్యయనంలో తేలింది. కృష్ణా నది వ్యర్థాల్లో 78శాతం పాలిథిన్‌ కవర్లు, చిప్స్‌, బిస్కెట్‌ ప్యాకెట్ల రేపర్స్‌ ఉంటున్నాయి. 20శాతం ప్లాస్టిక్‌ బాటిళ్లు, కప్పులు ఉండడం గుర్తించారు. మిగతా రెండు శాతం.. ప్లాస్టిక్‌ చెంచాలు, ఫోర్క్‌లు లాంటివి ఉన్నాయి. ఇవన్నీ నీటిలో కలిసిపోయి.. దిగువ ప్రాంతాలకు వెళ్లిపోవడం, చుట్టుపక్కల ఉండే నదీ పరివాహక ప్రాంత భూగర్భంలోకి వెళుతుండడం జరుగుతోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని