ఉనికి కోసమే తెదేపా ఆందోళనలు
eenadu telugu news
Published : 16/09/2021 05:14 IST

ఉనికి కోసమే తెదేపా ఆందోళనలు

రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజు


ఇంటి నిర్మాణ వివరాలు తెలుసుకుంటున్న మంత్రి శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యేలు గిరిధర్‌రావు, ముస్తఫా తదితరులు

గుంటూరు(జిల్లాపరిషత్‌), న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఉనికిని కాపాడుకోవడానికే రైతుల పేరుతో తెదేపా ఆందోళనలు చేస్తుందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు విమర్శించారు. గుంటూరులోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో వైకాపా రాజ్యసభ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, గుంటూరు నగర ఎమ్మెల్యేలు మహమ్మద్‌ ముస్తఫా, మద్దాళి గిరిధర్‌తో కలిసి బుధవారం మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను చూసి ఎక్కడ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందేమోనని భావించి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఆందోళనలు చేయిస్తున్నారని ఆరోపించారు. 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతుల రుణాలు రద్దు చేస్తామని, బంగారం పెట్టి రుణాలు తీసుకోండని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నామమాత్రంగా రుణాలు రద్దు చేశారని గుర్తు చేశారు. గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు సరఫరా చేస్తున్నామన్నారు. రానున్న కాలంలో పంటలను కూడా అక్కడే కొనుగోలు చేస్తామన్నారు. పంటలకు సంబంధించి బీమా సొమ్మును కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రాష్ట్రంలో 14 నెలలు కొవిడ్‌ ఉంటే టమాట, బత్తాయి, అరటి, పసుపు, పత్తి, మొక్కజొన్న, కొబ్బరి, పొగాకు, రొయ్యలు, చేపలను ప్రభుత్వం కొనుగోలు చేసిందని వివరించారు. ధాన్యం 100 శాతం మద్దతు ధరకు కొనుగోలు చేశాం. ఆక్వా రంగంలో విద్యుత్‌ రాయితీకి రూ.1000 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో రైతులు పంట విరామం ప్రకటించినట్లు తెదేపా నాయకులు ప్రచారం చేస్తున్నారని, వాస్తవంగా ఖరీఫ్‌లో సాగునీరు విడుదల చేశామని చెప్పారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఆరోపణలు, చౌకబారు విమర్శలు చేయవద్దని, మంచి సలహాలు ఇస్తే ప్రభుత్వం స్వీకరిస్తుందన్నారు. గుంటూరు జిల్లాలో బీపీటీ రకం ధాన్యం అధిక మొత్తంలో పండేలా చూస్తున్నామన్నారు. ‘రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవు. ఆత్మహత్య అనేది ఒక జబ్భు ఆర్థిక సమస్యలు, కుటుంబంలో ఇబ్బందులు ఉన్నవారు మాత్రమే ఆత్మహత్య చేసుకుంటారు. రూ.7 లక్షల పరిహారం ఇస్తారని ఎవరూ ఆత్మహత్యలు చేసుకోరు. ఆత్మహత్యలు జరగకూడదని కోరుకోండి’.. అని సూచించారు. సమావేశంలో గుంటూరు నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు పాల్గొన్నారు.

మేడికొండూరు: దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణం జరుగుతోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు అన్నారు. ఆయన బుధవారం మండలంలోని పేరేచర్లలో గుంటూరు నగర లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చిన నివేశన స్థలాలను పరిశీలించారు. ఆయన వెంట హోంమంత్రి సుచరిత, గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు ముస్తఫా, గిరిధర్‌రావు, రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి, సబ్‌-కలెక్టర్‌ అనుపమ అంజలి, గుంటూరు మేయర్‌ మనోహర్‌నాయుడు, నగర కమిషనర్‌ అనూరాధ ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గుంటూరు జిల్లాలోనే 3 లక్షల ఇళ్లు కట్టిస్తున్నామన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని