కళాశాలల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం
eenadu telugu news
Published : 16/09/2021 03:43 IST

కళాశాలల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం


వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ జె.నివాస్‌

కృష్ణలంక, న్యూస్‌టుడే : జిల్లాలో యువతకు ఓటు హక్కుపై అవగాహన కల్పించడంతోపాటు 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకునేందుకు జూనియర్‌, డిగ్రీ కళాశాలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ అధికారులను ఆదేశించారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై రిటర్నింగ్‌ అధికారులు, ఏఈఆర్వోలు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బుధవారం సమీక్షించారు. క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్‌ జె.నివాస్‌తో పాటు జేసీ కె.మోహనకుమార్‌, డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించాలన్నారు. 2022 జనవరి 5న తుది ఓటర్ల జాబితాను ప్రకటించేందుకు అవసరమైన కార్యాచరణ పటిష్ఠంగా అమలు పరచాలన్నారు. నవంబరు 1న సమీకృత ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జనవరి 1 నాటికి 18 ఏళ్ల నిండిన వారిని గుర్తించి ఓటరుగా నమోదు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో ప్రస్తుతం 36,53,157 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారన్నారు. రెండు నియోజకవర్గాల్లో ఈఆర్‌ఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ జె.నివాస్‌ జిల్లాలోని ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలతో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై సమీక్షించారు. జడ్పీ సీఈఓ సూర్యప్రకాశరావు, డీఆర్డీఏ పీడీ ఎం.శ్రీనివాసరావు, డ్వామా పీడీ జీవీ సూర్యనారాయణ, మచిలీపట్నం ఆర్డీఓ ఎస్కే ఖాజావలి తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని