మోసం గురూ...
eenadu telugu news
Updated : 16/09/2021 12:50 IST

మోసం గురూ...

బోగస్‌ వెబ్‌సైట్లు, ప్రకటనలతో ఎర

ఆన్‌లైన్‌లో వివిధ రకాలుగా బురిడీ

ఈనాడు, అమరావతి

ప్రముఖ కంపెనీల పేరుతో ఉద్యోగాలు అంటూ ఎర వేస్తారు. ఇంటి పట్టునే ఉండి సంపాదించవచ్చని ఆశపెట్టిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ పథకాల పేరుతో నకిలీ వెబ్‌సైట్లను తెరుస్తారు. ఇవి అసలు సైట్లు అని భ్రమింపజేస్తారు. గుడ్డిగా నమ్మితే.. తమ ముగ్గులోకి లాగి అందినకాడికి దోచుకుంటున్నారు. నిజమే అని నమ్మి అంతో ఇంతో పరిజ్ఞానం ఉన్న వారే తేలికగా మోసగాళ్ల మాయలో పడిపోతున్నారు. విడతల వారీగా రూ.లక్షల్లో సమర్పించుకుంటున్నారు. తీరా తాము మోసపోయామని గుర్తించే సరికి అంతా అయిపోతోంది. ఇటీవలి కాలంలో ఈ తరహా మోసాలు విజయవాడ నగర కమిషనరేట్‌ పరిధిలో చోటుచేసుకుంటున్నాయి. పలువురు నగర వాసులు ఇటువంటి కేటుగాళ్ల చేతిలో మోసపోతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఎంతో అప్రమత్తంగాఉండాల్సిన అవసరాన్ని ఇవి సూచిస్తున్నాయి.

నమ్మించి మోసం..

*అనుమానం వస్తే.. పీఐబీ (ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో)కు @PIBFactCheck పేరుతో ట్వీట్‌ చేసి, అసలా? నకిలీనా? అని తెలుసుకోవచ్ఛు● విజయవాడ నగరానికి చెందిన ఓ వ్యక్తికి ఇటీవల ఓ సంక్షిప్త సందేశం వచ్చింది. అమేజాన్‌లో పార్ట్‌టైమ్‌ కొలువులు ఉన్నాయని, దీనికి అత్యవసరంగా ఉద్యోగులు కావాలని.. రోజుకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు ఆదాయం వస్తుందన్నది సారాంశం. వివరాల కోసం అందులోని లింక్‌పై క్లిక్‌ చేశాడు. అది వాట్సాప్‌ చాట్‌లోకి వెళ్లింది. అవతలి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు యూఆర్‌ఎల్‌ లింక్‌ పంపించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయించారు. ఉద్యోగం ఎలా ఉంటుందని వివరాలు అడిగితే.. మూడు టాస్కులు ఉంటాయని, ప్రతి దానికి రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తుండగా.. తొలుత కొద్ది మొత్తం డబ్బు వేశారు. నిజమే అని నమ్మి విడతల వారీగా రూ.3.83లక్షలు మోసగాళ్ల ఖాతాలకు డబ్బు జమ చేశాడు. చివర్లో కానీ అర్థం కాలేదు తాను మోసపోయానని.

*● విజయవాడ శివారు ప్రాంతంలో నివాసం ఉండే ఓ ఉద్యోగి తన వ్యవసాయ భూమిలో సోలార్‌ పంపు సెట్‌ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నాడు. ప్రధాన మంత్రి కిసాన్‌ కుసుమ్‌ వికాస్‌ యోజన కింద పంపుసెట్లకు రాయితీ వస్తుందని తెలుసుకున్నాడు. దీని వివరాలు కోసం ఆన్‌లైన్‌లో వెతికాడు. ఈ పథకం పేరుతో

www.onlinekisankusumyojana.com అనే వెబ్‌సైట్‌ కనిపించింది. ఇందులోకి వెళ్లి పేరు, ఫోన్‌ నెంబరు, మెయిల్‌ ఐడీలతో వివరాలను నమోదు చేసుకున్నాడు. అనంతరం ఓ వ్యక్తి ఫోన్‌ చేసి, తాను పీఎం కిసాన్‌ కుసుమ్‌ యోజన నుంచి ఉద్యోగిని అని మాట్లాడాడు. రిజిస్ట్రేషన్‌, అదనపు రిజిస్ట్రేషన్‌, ఇన్‌స్టలేషన్‌, రకరకాల ఛార్జీల పేరుతో విడతల వారీగా రూ.4.22లక్షల జమ చేయించుకున్నాడు. ఇంకా అదనపు ఛార్జీల పేరుతో డబ్బు చెల్లించమని అడుగుతుండడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వ పథకాలతో...

కేంద్ర ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలకు సంబంధించి రాయితీలను అందిస్తోంది. వీటి గురించి తెలుసుకుని లబ్ధిని పొందేందుకు పలువురు అంతర్జాలంలోకి వెళ్లి అన్వేషిస్తుంటారు. దీనిని తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు సైబర్‌ కేటుగాళ్లు. పథకం గురించి తెలుసుకునేందుకు గూగుల్‌, తదితర సెర్చ్‌ ఇంజిన్లలో టైప్‌ చేయగానే వీరు తయారు చేసిన సైట్లు వచ్చేలా చేస్తారు. దీని వల్ల చాలా మంది మోసగాళ్ల మాయలో పడుతున్నారు.

*● కేంద్ర ప్రభుత్వానికి చెందిన వెబ్‌సైట్ల డొమైన్‌ పేర్లు చివరలో gov.in లేదా nic.in అని ఉంటుంది. ఇలా ఉంటేనే ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ అని గుర్తించాలి. ఇది కాకుండా .com, .org, blogspot.com అని ఉంటే బోగస్‌ అని భావించి వాటి జోలికి వెళ్లకపోవడం మంచిది. కేవలం సమాచారం తెలుసుకోవడానికే పరిమితం కావాలి. అంతేకానీ విచారణ, నమోదు, తదితర వాటితో ముందుకు వెళ్తే మోసం చేస్తారు.

*● కేవలం డొమైన్‌ పేరునే కాకుండా, సబ్‌డొమైన్‌ను కూడా తరచిచూడాలి. అసలు వెబ్‌సైట్‌ పేరుకు సబ్‌డొమైన్‌ను తగిలించి అసలు సైట్‌గా బురిడీ కొట్టిస్తారు.

*● అంతర్జాలంలో వెబ్‌సైట్ల చిరునామాలను జాగ్రత్తగా గమనించాలి. చాలా వరకు తమ కంపెనీల పేర్లు ఉంటాయి. ప్రముఖ సైట్లకు మోసగాళ్లు అదనపు అక్షరాలను కూడా జోడిస్తారు. వీటిని జాగ్రత్తగా గమనించాలి.

*● మన వ్యక్తిగత సమాచారాన్ని అడిగితే అనుమానించాలి. వారికి అవసరం లేని, పూర్తిగా గోప్యత పాటించాల్సిన విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఉదా. ఆధార్‌ నెంబరు, బ్యాంకు ఖాతా వివరాలు, వంటివి.

*అనుమానం వస్తే.. పీఐబీ (ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో)కు @PIBFactCheck పేరుతో ట్వీట్‌ చేసి, అసలా? నకిలీనా? అని తెలుసుకోవచ్ఛు

*ఉద్యోగాల పేరుతో వచ్చే ఆఫర్లను కూడా ఒకటికి రెండుసార్లు పరిశీలించాలి. వీలైతే ఆ కంపెనీకి సంబంధించిన వెబ్‌సైట్‌లోకి వెళ్లి వాకబు చేయాలి. ఎప్పటి నుంచి పనిచేస్తోంది, వంటి విషయాలను ఆరా తీస్తే మంచిది.

*● ఆయా కంపెనీలు తమ సైట్లలో వివరాలను ఉంచుతాయి. వాటిలోకి వెళ్లి కెరీర్స్‌ అనే ట్యాబ్‌పై క్లిక్‌ చేస్తే వివరాలు ప్రత్యక్షమవుతాయి. అంతేకానీ అందరికీ బల్క్‌గా ఉద్యోగాలు ఉన్నాయని ఎస్‌ఎంఎస్‌ రూపంలో పంపించవు.

*● గుర్తు తెలియని వ్యక్తులు చేసే ఫోన్లు, మెసేజ్‌లు, మెయిల్స్‌కు స్పందించకూడదు. వారు చెప్పే విషయాలను ఎంతమాత్రం నమ్మకూడదు. అనుమానం ఉంటే సంబంధిత సంస్థ ఫోన్‌ నెంబరు తీసుకుని మాట్లాడి ధ్రువీకరించుకోవాలి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని