నిషేధాజ్ఞలు
eenadu telugu news
Published : 31/07/2021 04:28 IST

నిషేధాజ్ఞలు

తెదేపా నేతల పర్యటనకు అనుమతి లేదంటున్న పోలీసులు

ఈనాడు, అమరావతి

కొండపల్లి అభయారణ్యంలో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు వివాదాస్పదం కావడం, తెదేపా, వైకాపా వర్గాల మధ్య పరస్పర దాడుల నేపథ్యంలో ఈ ప్రాంతంలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. శనివారం తెదేపా నిజ నిర్ధారణ కమిటీ కొండపల్లి పర్యటనకు వెళ్లాలని నిర్ణయించడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే నాయకులను గృహ నిర్బంధం చేయాలని నిర్ణయించారు. ఇటీవల మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆ ప్రాంతాన్ని పరిశీలించి వస్తుండగా వైకాపా వర్గాలు దాడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై దేవినేనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఎస్సీ ఎస్టీ చట్టంతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఏకపక్షంగా కేసులు నమోదు చేశారని తెదేపా శ్రేణులు ఆరోపిస్తున్నాయి. వైకాపా నేతలపై సాధారణ సెక్షన్‌ల కింద కేసులు పెట్టడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు కొండపల్లిలో ఏం జరిగిందనేది తెలుసుకునేందుకు తెదేపా నిజ నిర్ధారణ కమిటీ పర్యటనకు వెళ్లాలని నిర్ణయించింది. శనివారం ఉదయం పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్లరామయ్య నేతృత్వంలో 10 మంది సభ్యులు విజయవాడ నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. దీనిలో మాజీ మంత్రులు, పొలిట్‌బ్యూరో సభ్యులు ఉన్నారు. మరోవైపు పార్టీ శ్రేణులు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

● కొండపల్లి రిజర్వు ఫారెస్టు పరిధిలో భారీగా అక్రమంగా తవ్వకాలు జరిగిన విషయం తెలిసిందే. గతేడాదిగా ఈ అక్రమ తవ్వకాలపై అధికారులు చర్యలు తీసుకోలేదు. కేసులు పెట్టి చేతులు దులుపేసుకున్నారు. మరోవైపు ఈ ప్రాంతం కొండపోరంబోకు అని, అటవీ ప్రాంతానికి చెందినది కాదని, రెవెన్యూ ప్రభుత్వ భూమి పరిధిలో ఉంటుందని చెబుతున్నారు. దీనిపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు నిజనిర్ధారణ కమిటీ వెళ్లేందుకు నిర్ణయించారు. తమతో పాటు అధికారులను కూడా పంపాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. కానీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అధికారులు వెళ్లేందుకు సిద్ధంగా లేరని తెలిసింది. రిజర్వు ఫారెస్టు ప్రాంతానికి కొండపల్లి గ్రామం నుంచి కడెంపోతవరం గ్రామం మీదుగా చేరుకోవచ్ఛు మరో మార్గం జి.కొండూరు నుంచి ఉంటుంది. గడ్డెమణుగు, లోయ గ్రామాల మీదుగా చేరుకోవచ్ఛు ఈ రెండు దారులు మినహా ఆ ప్రాంతానికి చేరుకోలేరు. ఈ మార్గాలను పోలీసులు మూసివేసి అడ్డుకోనున్నారు.

అనుమతి లేదు..!

ఈ విషయమై నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులును ‘ఈనాడు’ సంప్రదించగా తాము ఎవరికీ అనుమతి ఇవ్వలేదని వివరణ ఇచ్చారు. శాంతి భద్రతల దృష్ట్యా ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించామని చెప్పారు. పరస్పర ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నందున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని