పోలీసు బూత్‌లొచ్చాయ్‌
eenadu telugu news
Updated : 31/07/2021 06:14 IST

పోలీసు బూత్‌లొచ్చాయ్‌

నగరంలో 56 ఏర్పాటు

ఈనాడు, అమరావతి


మాచవరంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ పోలీసు బూత్‌

ముఖ్యమైన కూడళ్లు, ప్రాంతాల్లో ట్రాఫిక్‌ విధులు నిర్వర్తించే సిబ్బంది కోసం ప్రత్యేక బూత్‌లు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి టెండరును ఖరారు చేసి, ఓ ప్రైవేట్‌ ఏజెన్సీకి వీఎంసీ అప్పగించింది. కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 56 రానున్నాయి. దశలవారీగా కీలకమైన చోట్ల వీటిని పెడుతున్నారు. గజిబిజిగా ఉండే విజయవాడ ట్రాఫిక్‌ విధులు అంటేనే కఠిన పరీక్ష. వాహనాలను నియంత్రించడం ఒక ఎత్తు అయితే.. కనీసం తలదాచుకునే అవకాశాలు లేకుండా చేయడం మరో ఎత్తు. నానాటికీ పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా నగరంలో ఎక్కడా సదుపాయాలు లేవు. ప్రతికూలమైన పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యం బారిన పడాల్సి వస్తోంది. పలు ముఖ్యమైన ప్రాంతాల్లో విధులు నిర్వర్తించేందుకు ఎక్కడా ఐలాండ్‌లు లేవు. ఇక నుంచి ఈ సమస్య తీరనుంది.

● ట్రాఫిక్‌లో విధులు ఎనిమిది గంటలు నిర్వహిస్తారు. రెండు విడతల్లో డ్యూటీ చేయాల్సి ఉంది. ఒక్కో విడతలో నాలుగేసి గంటలు చేయాలి. ఎక్కువ సమయం నిలబడాల్సి ఉండడంతో రెండు దఫాలుగా వేస్తారు. ఆయా ప్రాంతాల స్థాయిని బట్టి బీట్ల సమయాన్ని నిర్ధారిస్తారు. ముఖ్యమైన ప్రాంతాల్లో అయితే 24 గంటలు, ఓ మోస్తరు రద్దీ ఉన్న చోట్ల 16, మిగిలిన చోట్ల 8 గంటల చొప్పున వేస్తారు. నగరంలో ప్రముఖుల రాకపోకలు బాగా పెరిగాయి. దీంతో ప్రధాన కూడళ్లల్లో ఎక్కువ మంది ఉండాల్సి వస్తోంది. బెంజిసర్కిల్‌ వద్ద ఐదుగురు విధులు నిర్వహిస్తున్నారు. నిర్మల, రమేష్‌, మహానాడు, రామవరప్పాడు, పీసీఆర్‌ కూడళ్లు వంటి చోట్ల 24 గంటలూ ఉండాల్సి వస్తోంది. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తున్నారు.

● ‘స్ట్రీట్‌ ఫర్నీచర్‌’ కింద గతేడాది సిటీ బస్టాప్‌లను కార్పొరేషన్‌ నిర్మించింది. ఈ పథకం కింద ఈ దఫా పోలీసు బూత్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఇనుము, గ్లాస్‌తో తయారైన వీటిలో సిబ్బంది కోసం రెండు కుర్చీలు, ఓ ఫ్యాన్‌ను బిగించారు. విధుల మధ్యలో కొద్దిసేపు సేద తీరేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. వీటిపై ప్రకటనల ద్వారా ఏజెన్సీకి ఆదాయం సమకూరుతుంది. మున్ముందు ఈ బూత్‌లపై సౌరపలకలను కూడా బిగించనున్నారు. దీని ద్వారా విద్యుత్తు ఆదా అవుతుంది. ఇప్పటికే బెంజిసర్కిల్‌, చుట్టుగుంట, మాచవరం, సితార కూడలి, తదితర చోట్ల ఏర్పాటు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని