ఉప మేయర్‌- 2 గా అవుతు శ్రీశైలజ
eenadu telugu news
Published : 31/07/2021 04:28 IST

ఉప మేయర్‌- 2 గా అవుతు శ్రీశైలజ

శ్రీశైలజను సత్కరిస్తున్న మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ కరీమున్నీసా

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: విజయవాడ నగరపాలక సంస్థ రెండో ఉప మేయర్‌గా 58వ డివిజన్‌ వైకాపా కార్పొరేటర్‌ అవుతు శ్రీశైలజ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు నగరపాలక సంస్థ కౌన్సిల్‌ హాల్లో కలెక్టర్‌ జె.నివాస్‌.. ప్రిసైడింగ్‌ అధికారి హోదాలో ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. తొలుత పోటీచేసే అభ్యర్థులకు సంబంధించిన ప్రతిపాదనలను సభ్యులు సభ ముందుకు తేవాలని ఆయన ఆహ్వానించారు. ఆపై అవుతు శ్రీశైలజ పేరును 33వ డివిజన్‌ కార్పొరేటర్‌ వి.ఎన్‌.డి.ఎస్‌.ఎస్‌. మూర్తి ప్రతిపాదించగా, 17వ డివిజన్‌ కార్పొరేటర్‌ తంగిరాల రామిరెడ్డి బలపరుస్తున్నట్లు ప్రకటించారు. ఉప మేయర్‌ పదవికి పోటీ చేసేందుకు సభలోని ఇతర సభ్యుల నుంచి ఇతర ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయా? అని ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారి ప్రశ్నించి, కొద్దిసేపు వేచి చూశారు. ఇతర ప్రతిపాదనలు ఏమీ రాకపోవడంతో శ్రీశైలజ రెండో ఉప మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్‌ నివాస్‌ ప్రకటించి ధ్రువపత్రం అందజేశారు. అనంతరం ఆమెను సభలో ఉన్న మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, శాసన సభ్యుడు మల్లాది విష్ణు, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, ఉప మేయర్‌ బెల్లం దుర్గ, కార్పొరేటర్లు సత్కరించి, అభినందించారు. ఉప మేయర్‌ ఎన్నిక ప్రక్రియకు తెదేపా, సీపీఎం కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎం.డి.కరీమున్నీసా, కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌, వైకాపా ఫ్లోర్‌లీడర్‌ వెంకట సత్యనారాయణ, నగరపాలక సంస్థలోని పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని