జగన్‌రెడ్డి పాలనలో హత్యలు, అత్యాచారాలు
logo
Published : 23/06/2021 06:12 IST

జగన్‌రెడ్డి పాలనలో హత్యలు, అత్యాచారాలు

తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత


అఘాయిత్యం జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత, కృష్ణా జిల్లా జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌ అనురాధ, జయలక్ష్మి తదితరులు

నగరంపాలెం(గుంటూరు), న్యూస్‌టుడే: రెండేళ్ల జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో 500కు పైగా హత్యలు, అత్యాచారాలు జరిగాయని, సీఎం నివాసానికి కూతవేటు దూరంలో యువతిపై అత్యాచారం జరిగితే సత్వర చర్యలు తీసుకోకపోవడం హేయమని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మండిపడ్డారు. అత్యాచారానికి గురై గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధిత యువతిని వంగలపూడి అనిత, కృష్ణా జిల్లా జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌ గద్దె అనురాధ, తెలుగు మహిళ గుంటూరు పార్లమెంట్‌ అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ సీఎం నివాసానికి కూతవేటు దూరంలో దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిగితే సీఎం స్పందించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఒక మహిళ హోంమంత్రిగా ఉండగా ఇలా జరగడం సిగ్గు చేటన్నారు. హోం మంత్రి, మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌లు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగం వల్లే యువకులు గంజాయి, మత్తులకు బానిసలై సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారన్నారు. సీఎం నివాసం, డీజీపీ కార్యాలయాల సమీపంలోనే గంజాయి అరికట్టలేకపోయారని విమర్శించారు. దిశ చట్టం ద్వారా 21 రోజుల్లో నిందితులకు శిక్ష పడేలా చేస్తామని ప్రగల్భాలు పలికిన వారు, ఎంత మందిని శిక్షించారో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ఆదేశాల మేరకు బాధిత యువతిని పరామర్శించామని, ఆమెకు తెదేపా అండగా ఉంటుందన్నారు. గద్దె అనురాధ మాట్లాడుతూ నిందితులను నాలుగు రోజులైనా ఎందుకు పట్టుకోలేకపోయారని మండిపడ్డారు. గౌతమ్‌ సవాంగ్‌ డీజీపీగా విఫలమయ్యారని విమర్శించారు. బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి జీవితంపై భరోసా కల్పించాలన్నారు. అన్నాబత్తుని జయలక్ష్మి మాట్లాడుతూ నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సర్వజనాసుపత్రికి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, గుంటూరు తెదేపా పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి తెనాలి శ్రావణకుమార్‌, పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు, కనపర్తి శ్రీనివాస్‌లు మహిళా ప్రతినిధులతో కలిసి వచ్చినా వెలుపలే ఉండిపోయారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని