విజయవాడకు పిల్లల ఆస్పత్రి!
logo
Published : 23/06/2021 05:36 IST

విజయవాడకు పిల్లల ఆస్పత్రి!

రూ.180 కోట్లతో నిర్మాణం

ఈనాడు, అమరావతి

విజయవాడ నగరంలో చిన్నపిల్లల ఆస్పత్రి (పీడియాట్రిక్‌ కేర్‌ సెంటర్‌) నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి అనుబంధంగా ఈ చిన్న పిల్లల ఆసుపత్రిని అన్ని ఆధునిక హంగులతో నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ప్రాథమికంగా రూ.180 కోట్లతో భవన నిర్మాణం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అధికార వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో చిన్న పిల్లల కోసం ప్రత్యేక ఆస్పత్రులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటి విశాఖపట్నంలో, రెండోది తిరుపతిలో నిర్మాణం చేసేందుకు నిర్ణయించారు. మూడోది విజయవాడ జీజీహెచ్‌కు అనుబంధంగా లేదా... గుంటూరు జీజీహెచ్‌కు అనుబంధంగా నిర్మాణం చేయాలనేదానిపై సందిగ్ధం నెలకొంది. చివరికి విజయవాడ ఖరారు చేశారు. కొవిడ్‌ మూడో దశ వ్యాప్తి చెందితే చిన్న పిల్లలపై ప్రభావం ఉంటుందనే అంచనాల నేపథ్యంలో ఈ ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు తీసుకోవడం విశేషం. ఇటీవల వైద్యారోగ్య శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ రాఘవేంద్రరావు బృందం విజయవాడ జీజీహెచ్‌ ఆసుపత్రి ఆవరణను పరిశీలించి పీడియాట్రిక్‌ విభాగానికి అనువైనదిగా గుర్తించారు. ఇదే అంశాన్ని ప్రభుత్వానికి ప్రతిపాదించారు.

ఇవీ ప్రతిపాదనలు..

ప్రస్తుతం విజయవాడలో పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి కేంద్రం నిర్వహిస్తున్నారు. ఇక్కడే చిన్నపిల్లల కోసం మూడు విభాగాల్లో 90 పడకలను ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయి సౌకర్యాలు మాత్రం అందుబాటులో లేవు. తల్లీబిడ్డల కేంద్రంగా కొనసాగుతోంది. విజయవాడ జీజీహెచ్‌లో పీడియాట్రిక్‌ విభాగం లేదు. జీజీహెచ్‌లో ఒక సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌ మాత్రం కొత్తగా నిర్మాణం చేశారు. సిద్ధార్థ వైద్య కళాశాలకు కేటాయించిన 58 ఎకరాల స్థలంలో ప్రస్తుతం వివిధ నిర్మాణాలకు 8 ఎకరాలను మాత్రమే వినియోగించారు. ఇంకా 50 ఎకరాలు అందుబాటులో ఉంది. ఈ స్థలంలోనే దీన్ని నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు. గుంటూరులో జీజీహెచ్‌కు అనుబంధంగా చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం చేయాలని మొదట ప్రతిపాదించారు. కానీ అక్కడ స్థలం లేదు. అరండల్‌పేట సమీపంలో బొంగరాలగూడెంలో 6 ఎకరాలు అందుబాటులో ఉంది. ఇది గుంటూరు జనరల్‌ ఆసుపత్రికి దూరంగా ఉంటుంది. దీంతో గుంటూరు కంటే విజయవాడ మెరుగైన ప్రాంతంగా నిర్ణయించారు. ఇటీవల రూ.150కోట్లతో సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌ను పూర్తి చేశారు. ప్రస్తుతం దీనిలో కొవిడ్‌ రోగులకు పడకలు ఏర్పాటు చేశారు. సిద్ధార్థ మెడికల్‌ కళాశాల ఆవరణలోనే ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం పరిపాలన భవనం ఉంది. వైద్య కళాశాల, ఆసుపత్రి ఉన్నాయి. త్వరలో మెటర్నిటీ విభాగాన్ని ఇక్కడికే తరలించే ప్రతిపాదన ఉంది. దీంతో చిన్న పిల్లల ఆస్పత్రిని భారీ ఎత్తున నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు. హైదరాబాద్‌ నీలోఫర్‌ పిల్లల ఆసుపత్రి తరహాలో విజయవాడకు చిన్నపిల్లల ఆసుపత్రి ఉండాలని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. ప్రాథమికంగా 100 పడకలు, ఐసీయూ ఇతర మౌలిక వసతులతో ఏర్పాటు చేసి క్రమేపీ విస్తరించే అవకాశం ఉందని చెబుతున్నారు. చిన్న పిల్లల ఆసుపత్రి నిర్మాణానికి ప్రతిపాదనలను రూపొందిస్తున్న విషయాన్ని కలెక్టర్‌ జె.నివాస్‌ ధ్రువీకరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని