వ్యవసాయ రంగ బలోపేతానికి విప్లవాత్మక మార్పులు
logo
Published : 23/06/2021 05:36 IST

వ్యవసాయ రంగ బలోపేతానికి విప్లవాత్మక మార్పులు

విత్తన అవగాహన ప్రచార పత్రాలు ఆవిష్కరిస్తున్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, కలెక్టర్‌ నివాస్‌, ఎమ్మెల్యేలు తదితరులు

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : వ్యవసాయ రంగం బలోపేతానికి సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. నగరంలోని జలవనరుల శాఖ ఆవరణలోని రైతు శిక్షణ కేంద్ర భవనంలో మంగళవారం జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి రెండో సమావేశం నిర్వహించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమ కోసం మంచి ఆలోచనలతో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పంట ఉత్పత్తులను రైతు భరోసా కేంద్రాల్లోనే కొనుగోలు చేసి, గిట్టుబాటు ధరను కల్పిస్తామని చెప్పారు. రైతులు తదితరుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించినట్లు చెప్పారు. వీటిని అమలు చేస్తూ, మంచి ఫలితాలు సాధించడం ద్వారా, మూడో సమావేశం నాటికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ప్రస్తుత ఖరీఫ్‌లో రైతులకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇ-క్రాప్‌లో పంటలు నమోదు చేసుకోవడం ద్వారా రైతులు వివిధ ప్రయోజనాలు పొందవచ్చన్నారు. కనీస మద్దతు ధరను విస్తరించడానికి రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసుకున్నట్టు వెల్లడించారు. మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) మాట్లాడుతూ.. వారం రోజుల్లో వ్యవసాయ పనులను ప్రారంభించనున్న తరుణంలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, సాగునీటిని అందిస్తామన్నారు. మరో మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా రైతులను అన్ని విధాలుగా తమ ప్రభుత్వం ఆదుకుంటున్నట్టు తెలిపారు. కలెక్టర్‌ జె.నివాస్‌ మాట్లాడుతూ.. రైతు భరోసా, ఉచిత పంటల బీమా, రైతులకు వడ్డీ లేని రుణాలు తదితర పథకాల అమలులో జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నట్టు తెలిపారు. జిల్లాలో జులై 8న రైతు భరోసా కేంద్రాల భవనాల ప్రారంభోత్సవాలతో పాటు, డాక్టర్‌ వై.ఎస్‌.ఆర్‌. ఇంటిగ్రేటెడ్‌ అగ్రీ ఆక్వా టెస్టింగ్‌ ల్యాబ్‌ను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని