AP News: అసాంఘిక శక్తులకు అడ్డాలు
logo
Updated : 23/06/2021 09:39 IST

AP News: అసాంఘిక శక్తులకు అడ్డాలు

ఘాట్లలో కొరవడిన నిఘా

కృష్ణా నదికి రెండు వైపులా పెరిగిన ఆగడాలు

అడుగడుగునా మద్యం సీసాలే

‘ఈనాడు’ పరిశీలన

ఈనాడు, అమరావతి

సీతానగరం రైల్వే బ్రిడ్జి కింద ఇసుక తిన్నెల్లో ఎక్కడ చూసినా మద్యం సీసాలే..

కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య నుంచి ప్రవహించే కృష్ణా నదిలోని ఇసుక తిన్నెలు అరాచక శక్తులకు నెలవుగా మారాయి. నదికి రెండు వైపులా ఉన్న ఘాట్లు పోకిరీలకు అడ్డాలుగా మారాయి. ఐదేళ్ల క్రితం కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఘాట్లను భారీగా విస్తరించారు. వీటిని బ్లేడు బ్యాచ్‌, గంజాయి ముఠా, తాగుబోతులు, అసాంఘిక శక్తులు తమ కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నారు. ప్రశాంతత కోసం అటు తాడేపల్లిలో, ఇటు విజయవాడలోని ఘాట్లకు సాయంత్రం పూట వచ్చే వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. ఎక్కువగా కళాశాల విద్యార్థులు, ప్రేమికులు వస్తుంటారు. వీరిని బెదిరించి డబ్బు గుంజుకెళ్తుంటారు. రెండు వైపులా ఉన్న ఘాట్లు, వీటి వెంబడి నదిలోని పలు ప్రాంతాలను ‘ఈనాడు’ బృందం పరిశీలించింది. అన్ని చోట్లా అడుగడుగునా మద్యం సీసాలే దర్శనమిచ్చాయి. నిఘా లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది.

తాడేపల్లి వైపు...

● తాడేపల్లిలో బ్యారేజీ దిగువన సీతానగరం, మహానాడు ఘాట్లు ఉన్నాయి. వీటిలో సీతానగరం ఘాట్‌ పెద్దది. సీతారామాంజనేయ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న ప్రాంతంలో కొంత ఫర్వాలేదు. ఘాట్‌ చివరి వైపు మనుషుల అలికిడి తక్కువ. ఏకాంతం కోసం వచ్చి ఈ ఘాట్‌ మెట్లపై కూర్చునే వారిపై ఆకతాయిలు దాడి చేస్తుంటారు. బ్యారేజీపై వీఐపీల రాకపోకలు ఉండడంతో ఆ మార్గంలోనే పోలీసుల నిఘా ఉంటుంది. ఘాట్ల వైపు గస్తీ ఉండదు. ఈ రోడ్డులో రాత్రి సమయాల్లో వెళ్లాలంటేనే జనాలు హడలిపోతుంటారు. పైగా సీసీ కెమెరాలు కూడా లేవు. విజయవాడలోని ఘాట్ల వైపు జనావాసాలు, జనసంచారం ఎక్కువ. అక్కడితో పోలిస్తే ఇక్కడ పోకిరీల బెడద ఎక్కువ. ● ఘాట్లలో పుష్కరాల సందర్భంగా ఎనిమిది హైమాస్ట్‌ దీపాలు వేశారు. వీటిలో కేవలం రెండు మాత్రమే వెలిగేవి. అత్యాచార ఘటన తర్వాత యుద్ధప్రాతిపదికన అన్నింటికీ మరమ్మతులు చేశారు. సీతానగరం ఘాట్‌ పక్కనే ఉన్న మహానాడు ఘాట్‌ అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. మెట్లు మద్యం సీసాలతో నిండిపోయాయి. సీసాలు పగిలి కాలు పెట్టలేని విధంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా సీసాలు, ప్లాస్టిక్‌ గ్లాసులు కనిపిస్తాయి. ● ఈ ఘాట్ల దిగువన ఇసుక తెన్నెల్లో ముఖ్యంగా రైల్వే వంతెనల దిగువన ఉన్న ప్రాంతాల్లో అరాచక శక్తులు కార్యకలాపాలు సాగిస్తుంటారు. ఇక్కడ పోలీసుల నిఘా కొరవడడంతో దాడులు జరుగుతుంటాయి. ఘాట్లు దిగి లోపలికి వచ్చే వారిని బెదిరింది డబ్బు, బంగారు దోచుకుంటారు. పాత రైల్వే లైను పక్కన ఉన్న టవర్లు, పరిసర ప్రాంతాలు వీరి స్థావరాలు. ● ఈ రోడ్డులో అనేక ఆలయాలు, ఆశ్రమాలు ఉన్నాయి.అభయాంజనేయస్వామి, సీతారామాంజనేయస్వామి ఆలయాలు, దేవాదాయశాఖ రాష్ట్ర స్థాయి శిక్షణ కేంద్రం ఉన్నా నిఘా కొరవడింది.

విజయవాడ వైపు..

● నగరంలో ప్రకాశం బ్యారేజీ నుంచి వారధి వరకు 5 కి.మీ వరకు దూరం ఉంటుంది. ఈ ప్రాంతంలో కృష్ణవేణి, పద్మావతి ఘాట్లు ఉన్నాయి. వీటిపై సీసీ కెమెరాలు లేవు. విజయవాడలోని పలు ప్రాంతాల నుంచి బ్లేడ్‌, గంజాయి ముఠాలు సాయంత్రానికి ఇక్కడ తిష్ట వేస్తుంటాయి. పోలీసులు వస్తే నదిలోకి పరారవుతారు. అక్కడే మద్యం తాగుతుంటారు, గంజాయి, మత్తు పదార్థాలు తీసుకుంటారు. అర్ధరాత్రి వరకు మత్తులో జోగుతుంటారు. ఘాట్లలో కనిపించే వారిపై డబ్బు కోసం విచక్షణారహితంగా దాడి చేస్తారు.

 బస్టాండు ఎదురుగా రైల్వే వంతెన ఉంది. ఇక్కడే రైల్వేకు సంబంధించి తాగు నీటి పథకం, గ్యాంగ్‌ మెన్ల విశ్రాంతి గదులు, పి.వే కార్యాలయం ఉంది. వీటి ప్రాంగణాలు చీకటి పడ్డాక హిజ్రాలు, అసాంఘిక శక్తులకు అడ్డాలుగా మారుతున్నాయి. ఇక్కడ అంతా మద్యం సీసాలతో నిండిపోయాయి. రాజీవ్‌ గాంధీ పార్కు ఎదురుగా ఘాట్‌ వైపు చెట్లలో తిరుగుతుంటారు. కృష్ణవేణి ఘాట్‌ నుంచి రణదివేనగర్‌, కట్ట వరకు ఇదే పరిస్థితి. ఆప్రాన్‌ దిగువ నుంచి వారధి వరకు సాయంత్రం అయితే నదిలో చాలు వాలిపోతుంటారు.

ఇలా చేస్తే మేలు..

*● విజయవాడ, తాడేపల్లిలోని ఘాట్లలో సీసీ కెమెరాలు బిగించాలి.

*● ఈ మార్గం, ఘాట్లలో పోలీసు నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. రాత్రి సమయాల్లో నదిలోకి ఎవరినీ వెళ్లనీయకుండా చూడాలి.

*● రైల్వే వంతెన పైనుంచి అసాంఘిక శక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. వంతెనపై ఆర్పీఎఫ్‌ భద్రతా ఏర్పాట్లు చేయాలి.

*● హైమాస్ట్‌ దీపాలు నిత్యం వెలిగేలా చర్యలు తీసుకోవాలి.

పర్యటక ప్రాంతంగా అభివృద్ధికి అవకాశం

మహానాడు ఘాట్‌ ఎదురుగా రైల్వే టవర్లు ఉన్నాయి. వీటిని బ్రిటీష్‌ కాలంలో నిర్మించారు. కొత్త వంతెన నిర్మించాక వీటిని ఉపయోగించడం లేదు. ఇప్పటికీ ఇవి దృఢంగా ఉన్నాయి. వీటిపై నుంచి చూస్తే కృష్ణా నది అందాలు తనవితీరా చూడొచ్ఛు ఈ ప్రాంతాన్ని పర్యటకంగా అభివృద్ధి చేస్తే ఆదరణ చూరగొనే అవకాశం ఉంది. దీంతో పాటు ఇక్కడ సాగే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుంది. విజయవాడలోని పద్మావతి ఘాట్‌లో నిర్మించినట్లు ఫుడ్‌ కోర్టులు, హోటళ్లు ఏర్పాటు చేయొచ్ఛు దీని వల్ల జనసంచారం పెరుగుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని