విద్యుదాఘాతంతో నలుగురి దుర్మరణం
logo
Updated : 11/06/2021 03:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విద్యుదాఘాతంతో నలుగురి దుర్మరణం

జయరాజు మృతదేహం

జిల్లాలో వేర్వేరు సంఘటనల్లో విద్యుదాఘాతం కారణంగా గురువారం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వేమూరు మండలం పెరవలిపాలెంలో ఒకరు, తెనాలి పట్టణం, గ్రామీణ మండలంలోని కొలుకలూరులో కలిపి ఇద్దరు, నకరికల్లు మండలం చేజర్లలో ఒకరు మృతి చెందారు. వివరాలివీ..

వేమూరు, న్యూస్‌టుడే: విద్యుదాఘాతానికి గురై ఓ వ్యవసాయ కూలీ మృతిచెందిన ఘటన వేమూరు మండలంలోని పెరవలిపాలెం పొలాల్లో గురువారం ఉదయం జరిగింది. సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన కె.సుబ్బారావు (50) మిగిలిన కూలీలతో కలిసి ట్రాక్టరు ద్వారా సేంద్రియ ఎరువును పొలానికే తోలే పనికెళ్లారు. ట్రాక్టర్‌ పొలానికి చేరాక ఎరువును ‘అన్‌లోడ్‌’ చేసేందుకు డ్రైవర్‌ దానికున్న హైడ్రాలిక్‌ సాయంతో ట్రక్కును పైకి ఎత్తారు. అయితే పైనున్న 11 కేవీ విద్యుత్తు తీగలను గమనించకపోవడంతో ట్రక్కు వాటిని తాకింది. ఒక తీగ ట్రక్కుకున్న ఇనపరాడ్డుకు పట్టుకోవడంతో డ్రైవర్‌, ఎరువును అన్‌లోడ్‌ చేస్తున్న కూలీలు కిందకు దూకేశారు. ట్రాక్టర్‌ ఆగకుండా ముందుకు కదులుతుండడంతో దాన్ని ఆపాలనే ఉద్దేశంతో సుబ్బారావు దాని తాళాన్ని పట్టుకున్నారు. అంతే.. తీవ్ర విద్యుదాఘాతానికి గురై కాలిపోయి, అక్కడికక్కడే మృతిచెందారు. ట్రాక్టర్‌ ముందు చక్రాలు కూడా తగలబడడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ లోకేశ్వరరావు తెలిపారు.

చేజర్లలో రైతు

చేజర్ల(నకరికల్లు): విద్యుదాఘాతానికి గురై రైతు దుర్మరణం చెందిన సంఘటన చేజర్లలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. చేజర్లకు చెందిన కొత్తపల్లి జయరాజు (37) పొలంలో బోరు పని చేయడం లేదు. దీంతో గురువారం ట్రాక్టరు హైడ్రాలిక్‌ ద్వారా బోరును బయటకు తీస్తున్నారు. ఈ తరుణంలో ఎగువన ఉన్న ట్రాక్టరు హైడ్రాలిక్‌ కిందకు కదిలింది. దాన్ని ఆపే ప్రయత్నంలో జయరాజు ట్రాక్టరును పట్టుకున్నారు. ఆదే సమయంలో హైడ్రాలిక్‌కు విద్యుత్తు తీగలు తగిలి కరెంటు ప్రసరించడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. జయరాజు భార్య సుజాత రెండేళ్ల క్రితం అనారోగ్యంతో కన్నుమూసింది. వీరికి ఇద్దరు పిల్లలు. తల్లిదండ్రుల మృతితో ఆ ఇద్దరు చిన్నారులు ఒంటరి వారయ్యారు. ఆరు నెలలు క్రితం జయరాజు తమ్ముడు బుజ్జి అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేరాల ఉదయ్‌బాబు తెలిపారు.

తెనాలిలో ఇద్దరు..

తెనాలి టౌన్‌: పట్టణంలోని గంగానమ్మపేటలో పాత ఇంటి పునాదులను యంత్రంతో పగులగొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురైన బాలాజీరావుపేటకు చెందిన కార్మికుడు డి.శ్రీను(49) మృతి చెందారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామీణ మండలంలోని కొలకలూరులో ఒక ఇంటిపైనున్న డిష్‌కు మరమ్మతులు చేస్తున్న సమయంలో పైనున్న విద్యుత్తు తీగలు తగిలి పట్టణంలోని చినరావూరుకు చెందిన మణికుమార్‌(24) మృతిచెందారు. విగతజీవిగా ఇంటికి తీసుకొచ్చిన కుమారుడ్ని చూసి చలించిపోయిన అతని తల్లి ఇంటి లోపలికి వెళ్లి ఉరి వేసుకోవడానికి ప్రయత్నించారు. గమనించిన బంధువులు ఆమె యత్నాన్ని అడ్డుకున్నారు. గ్రామీణ పోలీసులు వివరాలు సేకరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని