అనంత జిల్లాలో రోడ్డుప్రమాదం: ఐదుగురి మృతి

తాజా వార్తలు

Updated : 19/12/2020 08:37 IST

అనంత జిల్లాలో రోడ్డుప్రమాదం: ఐదుగురి మృతి

 

ధర్మవరం :  పనులు ముగించుకుని ఇళ్లకు చేరుతున్న వేళ.. దూసుకొచ్చిన మృత్యువు కబళించింది. జాతీయ రహదారి రక్తమోడింది. ఐదు కుటుంబాల్లో విషాదం నిండింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకుడిని కారు ఢీకొట్టింది. కళ్లెదుట జరిగిన ప్రమాదం చూసేందుకు వెళ్లిన వారిని మృత్యువు వెంటాడింది. ఒక్కసారిగా జనం మీదకు లారీ దూసుకు రావడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడిన వారిలో ఇద్దరు ఆసుపత్రిలో చేరిన కొద్దిసేపటికే కన్నుమూశారు. శుక్రవారం సాయంత్రం బత్తలపల్లి మండలం రాఘవంపల్లి వద్ద జరిగిన రహదారి ప్రమాదంలో ఐదుగురు విగతజీవులుగా మారారు.

రాజశేఖర్‌ అనే యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనకే వస్తున్న కారు ఢీకొంది. అతను రోడ్డు అవతలిపైకి ఎగిరి పడి ప్రాణాలు కోల్పోయాడు. అక్కడే ఉన్న జనం పరుగున ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇంతలోనే కదిరి వైపు వెళుతున్న లారీ వారిమీదకు దూసుకొచ్చింది. మరో ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరో ఇద్దరు ఆస్పత్రిలో అసువులు బాశారు.

● *రాఘవంపల్లికి చెందిన రాజశేఖర్‌ బత్తలపల్లికి ద్విచక్రవాహనంపై వచ్చి స్వగ్రామానికి వెళ్తుండగా కారు ఢీకొని మృతి చెందాడు. వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాడు. రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతి చెందిన విషయం తెలియడంతో సంఘటనాస్థలానికి చేరుకున్న తండ్రి శ్రీకాంతప్ప, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అతనికి ఇంకా పెళ్లి కాలేదు.

*●ముష్ఠూరు గ్రామానికి చెందిన శివమ్మ రాఘవంపల్లికి వెళ్లేందుకు జాతీయ రహదారిపైకి వచ్చింది. అదే సమయంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాజశేఖర్‌ను చూసేందుకు వెళ్లిగా లారీ ఢీకొని మృత్యువాత పడింది. ఆమె భర్త నారాయణస్వామి, కుమారులు సాంబ, శివయ్య బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రి వద్దకు చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు.

●*తాడిమర్రి మండలం నార్శింపల్లికి చెందిన శ్రీనివాసులు చికెన్‌ సెంటర్‌ నడుపుతున్నాడు. అనంతపురానికి ద్విచక్రవాహనంపై వెళ్లి తిరిగి వస్తూ.. రాఘవంపల్లి వద్ద రోడ్డు ప్రమాద స్థలాన్ని చూసేందుకు వెళ్లాడు. లారీ దూసుకువచ్చి మృత్యువాత పడ్డాడు. ఇతనికి భార్య సువర్ణ, ఇద్దరు కుమారులు భార్గవ్‌, షణ్ముఖ ఉన్నారు.

*●బత్తలపల్లి మండలం సంజీవపురానికి చెందిన వలీసాబ్‌ భవన నిర్మాణ కార్మికుడు. స్వగ్రామం నుంచి బత్తలపల్లికి వెళ్తుండగా మార్గమధ్యలో జరిగిన ప్రమాద ఘటన చూసేందుకు వెళ్లాడు. ఈక్రమంలో లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతనికి భార్య అషీదా, కుమారులు నజీర్‌, హిమావలి ఉన్నారు.

●*బత్తలపల్లి మండలం సంజీవపురానికి చెందిన సూరి భవన నిర్మాణ కార్మికుడు. బత్తలపల్లికి బయలుదేరాడు. రహదారిపై జనం గుమికూడటంతో చూసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో లారీ ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సూరి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు.

 

 

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని