రివ్యూ: నారింజ మిఠాయి - naarinja mithai telugu movie review
close
Updated : 06/02/2021 22:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రివ్యూ: నారింజ మిఠాయి

చిత్రం: నారింజ మిఠాయి

నటీనటులు: సముద్రఖని, సునయన, మణికందన్‌, నివేదితా సతీష్‌, శ్రీరామ్‌, లీలా శాంసన్‌, సారా అర్జున్‌, రాహుల్‌

సంగీతం: ప్రదీప్‌ కుమార్‌

సినిమాటోగ్రఫీ: అభినందన్‌ రామానుజం, మనోజ్‌ పరమహంస, వినయ్‌ కార్తీక్‌, యామిని యజ్ఞమూర్తి

ఎడిటింగ్‌: హలితా షమీమ్

నిర్మాత: వెంకటేశ్‌ వెలినేని

సమర్పణ: సూర్య

కథ, దర్శకత్వం: హలితా షమీమ్‌

విడుదల: ఆహా ఓటీటీ

ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలు ప్రస్తుతం వివిధ ఓటీటీల వేదికగా ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ తర్వాత అలా వస్తున్న సినిమాల సంఖ్య గణనీయంగా పెరిగింది. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం ‘సిల్లు కరుప్పత్తి’. తెలుగులో ‘నారింజ మిఠాయి’ పేరుతో విడుదల చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? అసలు దీని కథేంటి?

కథేంటంటే: సింగిల్‌ లైన్‌లో చెప్పడానికి ఇది ఒక్కరి స్టోరీ కాదు. నాలుగు జంటల కథ. మురికివాడలో ఉండే పిల్లాడు- ధనవంతుల కుటుంబంలోని బాలిక (పింక్‌ బ్యాగ్‌), క్యాన్సర్‌తో బాధపడే యువకుడు- ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేసే అమ్మాయి (కాకా గాడి), ఆస్పత్రిలో పరిచయమైన ఇద్దరు వృద్ధులు (టర్టిల్స్), పెళ్లయి ముగ్గురు పిల్లలు ఉన్న జంట (హే అమ్ము) అంటూ నాలుగు చిన్న కథలను కలిపి ఒక గొడుగు కిందకు తీసుకొచ్చారు దర్శకురాలు. వేర్వేరు నేపథ్యాలు కలిగిన నాలుగు జంటల మధ్య ప్రేమ ఎలా పుట్టింది? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ‘ప్రేమ’ రాయడానికి, చెప్పడానికి రెండు అక్షరాలే కానీ, ప్రతి ఒక్కరి జీవితాలను తడిమే భావోద్వేగం. ప్రేమ ఎప్పుడు? ఎలా?ఏ వయసులో పుడుతుందో ఎవరూ చెప్పలేరు. అది ఎంత సంతోషాన్ని ఇస్తుందో.. అంతే బాధనూ పెడుతుంది. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ప్రేమలోని మాధుర్యాన్ని.. అదే ప్రేమలోని చేదును చూడకుండా అడుగు ముందుకు వేసి ఉండరు. ఇదే నేపథ్యాన్ని ‘నారింజ మిఠాయి’ కోసం తీసుకున్నారు హలితా షమీమ్‌. నాలుగు వేర్వేరు ప్రేమ కథలను ఒకటిగా చూపించే ప్రయత్నం చేశారు. అయితే, ఏ కథతోనూ ఇంకో కథకు సంబంధం ఉండదు. నలుగురు వేర్వేరు నేపథ్యాలు కలిగిన మనుషుల జీవితాలను ‘ప్రేమ’ ఎలా ప్రభావితం చేసిందన్నది చూపించారు.

‘పింక్‌ బ్యాగ్‌’ పేరుతో మొదటగా చూపించిన కథ ఆసక్తిగా సాగుతుంది. మురికవాడలో ఉండే మహేశ్‌ అనే బాలుడు.. ధనవంతురాలైన మిట్టీ అనే అమ్మాయి ఎలా కలుసుకున్నాడన్నది ఆద్యంతం అలరిస్తుంది. ఆయా సన్నివేశాలన్నీ ఆసక్తిగా అనిపిస్తాయి. ‘కాకీ గాడీ’ పేరుతో ఇద్దరు యువ జంట మధ్య ప్రేమను చూపించారు. క్యాబ్‌లో పరిచయమైన ఓ యువ జంట మధ్య ప్రేమ ఎలా చిగురించిందన్న కథ కాస్త రొటీన్‌గానే సాగుతుంది. ‘టర్టిల్స్‌’ పేరుతో వృద్ధ జంట మధ్య మరో ప్రేమకథను ఆసక్తిగా తీర్చిదిద్దాడు దర్శకురాలు. ఈ ప్రేమ కథకు ‘టర్టిల్స్‌’ అని పేరు పెట్టడానికి కూడా కారణాన్ని కథలోనే వివరించే ప్రయత్నం చేశారు. మలి వయసు ప్రేమకు చిన్న ఎమోషనల్‌ టచ్‌ ఇచ్చి తీర్చిదిద్దారు. చివరకు సుఖాంతం చేశారు. ఇక ‘హే అమ్ము’ పేరుతో చూపించిన ప్రేమ కథ మిడిల్‌క్లాస్‌ కుటుంబంలో మహిళల జీవితాలను ప్రతిబింబిస్తుంది. ఉదయం నుంచి రాత్రి వరకూ ముగ్గురు పిల్లలు, భర్త కోసం కష్టపడే సగటు మహిళ జీవితాన్ని చూపించారు. పెళ్లయి, పిల్లలు పుట్టి ఏళ్లు గడుస్తున్న కొద్దీ భార్యభర్తల మధ్య ప్రేమ ఏవిధంగా కొరవడుతుంతో ఈ కథలో కనిపిస్తుంది. ఈ కథ చాలా మంది జీవితాలకు దగ్గరగా ఉంటుంది.

ఎవరెలా చేశారంటే: ‘నారింజ మిఠాయి’లో సముద్రఖని మినహా మిగిలిన నటీనటులు ఎవరూ తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వాళ్లు కాదు. అయినా, ఆ పాత్రల్లో వాళ్ల నటన మెప్పిస్తుంది. మురికివాడ బాలుడిగా మహేశ్‌, మిట్టూగా సారా చక్కగా సరిపోయారు. ఇక యువ జంట మణికందన్‌, నివేదితా పర్వాలేదు. వృద్ధ జంట యశోద, ప్రకాశ్‌ పాత్రల్లో కనిపించిన లీలా శాంసన్‌, శ్రీరామ్‌ జోడీ తెరపై సరదాగా సాగిపోతుంది. ఆద్యంతం హృద్యంగా సాగుతుంది. ఇక ‘హే అమ్ము’లో కనిపించిన సముద్రఖని, సునయన జోడీ కూడా అలరిస్తుంది. తెరపై కనిపించే నటీనటులు ఎక్కడా మనకు నటిస్తున్నట్లు కనిపించదు. నిజ జీవిత కథకు చక్కగా సరిపోయారు.

సాంకేతికంగానూ సినిమా బాగుంది. ప్రదీప్‌ కుమార్‌ సంగీతం సినిమాలో మనల్ని లీనం చేస్తుంది. ఈ సినిమా విషయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ గురించి. అభినందన్‌ రామానుజం, మనోజ్‌ పరమహంస, వినయ్‌ కార్తీక్‌, యామిని యజ్ఞమూర్తి నాలుగు కథలను చక్కగా తెరకెక్కించారు. నాలుగు జంట జీవితాల్లో ‘ప్రేమ’ ఎలాంటి పాత్ర పోషించిందన్న నేపథ్యాన్ని తీసుకుని హలితా షమీమ్‌ చక్కగా తీర్చిదిద్దారు. ప్రతి సన్నివేశాన్ని హృద్యంగా రాసుకున్నారు. అయితే, ప్రతి కథలోనూ అక్కడక్కడా సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. కేవలం క్లాస్‌ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తీసినట్లు అనిపిస్తుంది. ఓటీటీ ప్రేక్షకులను మాత్రం ‘నారింజ మిఠాయి’ నచ్చుతుంది.

బలాలు బలహీనతలు
+ కథ, కథనాలు - అక్కడక్కడా సన్నివేశాల్లో సాగదీత
+ నటీనటులు - తెలుగు నేటివిటీకి దూరంగా ఉండటం
+ సాంకేతిక వర్గం పనితీరు  

చివరిగా: ‘నారింజ మిఠాయి’ కాస్త తియ్యగా.. కాస్త పుల్లగా..

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని